తెలంగాణలో ఆశావహులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నా మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఖరారు అయినట్టు తెలుస్తోంది. దసరా తర్వాత రాష్ట్ర మంత్రి వర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగా క్యాబినెట్ లో ఎవరిని ? తీసుకోవాలి.. ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న వారిలో ఎవరెవరి ? పక్కన పెట్టాలి అన్న దానిపై కేసీఆర్ ఇప్పటికే కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఒకటి రెండు మార్పులు ఉండొచ్చని… కొత్తగా నలుగురైదుగురికి అవకాశాలు వస్తాయని అధికార పార్టీలో చర్చలు నడుస్తున్నాయి.
తాజాగా గవర్నర్ నరసింహన్ బదిలీ తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వెంటనే బడ్జెట్ సమావేశాలు… బతుకమ్మ పండుగ కార్యక్రమాలు ఉండటంతో ఆ తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కేసీఆర్ తీసుకున్నట్టు సమాచారం. కేబినెట్‌లో మార్పులు.. చేర్పుల్లో ఈసారి మహిళలకు చోటు కల్పించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తొలి క్యాబినెట్లో మహిళలకు చోటు కల్పించలేదు. గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ వరుసగా రెండోసారి విజయం సాధించారు. రెండో క్యాబినెట్ లో సైతం మహిళలను తీసుకోలేదు. దీంతో కేసీఆర్ మహిళల వ్యతిరేకి అని ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఈ విమర్శలకు చెక్ పెట్టేందుకు ఆయన తన కేబినెట్లో మహిళలకు చోటు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రేసులో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కేబినెట్లోకి తీసుకోవటం ఖరారైంది. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మంత్రివర్గంలోకి తీసుకుంటారా ? లేదా అన్నది తీవ్రమైన సస్పెన్స్ గా కనిపిస్తోంది. హరీష్ కు చోటు కల్పించకుండా కేటీఆర్ ను మాత్రమే కేబినెట్లోకి తీసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా సామాన్య జనాల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయం కేసీఆర్‌కు తెలియంది కాదు.
ఇక సామాజిక పరంగా చూస్తే కేసీఆర్ సొంత సామాజిక వర్గానికి కీలకమైన పోస్టులు దక్కుతున్నాయి. కేసీఆర్‌తో పాటు ఎర్రబెల్లి ఇప్పటికే వెలమ వర్గం నుంచి మంత్రులుగా ఉన్నారు. ఇక మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఇప్పుడు మరో ఇద్దరికి అదే వర్గం నుంచి మంత్రులు అంటే మిగిలిన వర్గాల్లో అసంతృప్తి రావచ్చు. ఏదేమైనా ఆశావాహులు మాత్రం కేసీఆర్‌ను వరుసగా కలుస్తూ తమ మనస్సులో మాట చెపుతున్నారు.