జవహర్​నగర్​లో ఉద్రిక్తత.. మంత్రి మల్లారెడ్డి పాదయాత్రను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు

-

మేడ్చల్ జిల్లా జవహర్​నగర్​లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్​లోని గబ్బిలాల్​పేట ప్రాంతంలో పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలు వారిని చెదరగొట్టారు. మంత్రి మల్లారెడ్డి జవహర్​నగర్ ప్రాంతంలో నెలకొన్న సమస్యల విషయంలో పరిష్కారం చూపాలని లేని పక్షంలో పెద్ద ఉద్యమం చేపడతామని కాంగ్రెస్​ నేతలు హెచ్చరించారు. తమ ప్రాంతంలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఏం చేయలేదని మండిపడ్డారు. జవహర్ నగర్​లో జీవో నెంబర్​ 58, 59 అమలు, 50 పడకల ఆస్పత్రి విషయంలో మంత్రి మల్లారెడ్డి హామీలకే పరిమితమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

” ప్రజా సమస్యలు కోసం పాదయాత్రకు వచ్చిన మంత్రి అన్ని సమస్యలు తెలుసుకోవాలి. మొత్తం అన్ని డివిజన్​లో పర్యటించి ప్రజా సమస్యలు గుర్తించాలి. పాదయాత్ర మొక్కుబడిగా చేస్తే సహించేది లేదు. మా ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చూపకపోతే మరింత పెద్ద ఉద్యమం చేపడతాం.”- సునీత, కాంగ్రెస్​ నాయకురాలు

Read more RELATED
Recommended to you

Latest news