తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రావడంతో కాంగ్రెస్‌పార్టీలోని నేతలు ఆశలపల్లకీలో కూర్చుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీతోపాటు పార్టీ పోస్టుల కోసం నేతలు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. సామాజిక సమీకరణలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రక్రియలు వాయిదా పడ్డాయి.ఇంతలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనకు వెళ్లడంతో మరింత గ్యాప్ వచ్చింది. ఇక తాజాగా మరోసారి పదవుల పందారంపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి వర్గ విస్తరణలో బెర్తు దక్కేదెవరికి? అంటూ నేతలు మాట్లాడుకుంటున్నారు.
మొత్తం 6 బెర్తులు భర్తీ చేయనుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు లాబీయింగ్ చేసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పదవుల పంపకం ఉంటుందని అందరూ భావించారు. అయితే పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా, దక్షిణ కొరియాల పర్యటనకు వెళ్లడంతో పదవులు ఆశిస్తున్న నేతలు వేచి చూడాల్సివస్తోంది. విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వచ్చాక పదవుల పంపకంపై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నెల రోజుల క్రితమే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లడం, కాంగ్రెస్ సీనియర్లు కూడా హస్తినకు వెళ్లడంతో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే రెకమెండేషన్‌లు ఎక్కువగా ఉండటంతో పాటు సీనియర్‌లు సైతం రేసేలోకి రావడంతో ఏకాభిప్రాయం కుదరక తాత్కాలికంగా విస్తరణకు బ్రేక్ పడింది. ఇంతలో రేవంత్ ఫారిన్ టూర్‌తో కొంత జాప్యం జరిగింది. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి నాలుగు బెర్తులు మాత్రమే భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ బెర్తులపై కర్చీఫులు వేసేస్తున్నారు ఆశావహులు.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, తుంగతుర్తి ఎమ్మెల్యే శామ్యూల్, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు… సీఎం రేవంత్ రెడ్డిని ఇదివరకే కలిసీ తమ సామాజిక వర్గాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారట. ఇక లేటెస్టుగా ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా రేసులోకి వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 34 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ తరఫున గెలిచింది తాను ఒక్కడినే కాబట్టి, మంత్రివర్గం విస్తరణలో తనకు అవకాశం వస్తుందంటున్నారు ఆయన.
ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రిగిరి కావాలని పట్టుపడుతున్నారు.ఈసారి తనకు ఛాన్స్ ఉంటుందని నమ్ముతున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్.. ఎస్టీ కోటాలో సీద్ధంగా ఉన్నారు. ఆశావహుల జాబితాలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
చెన్నూరు ఎమ్మెల్యే, మాల సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత గడ్డం వివేక్ కూడా కేబినెట్‌లో చోటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి.. ఇంకా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పేరు కూడా ఆశావహుల జాబితాలో చేరిపోయింది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సైతం నేనున్నానంటూ రేసులోకి దూసుకొచ్చారు. అయితే 6 బెర్తులు ఖాళీగా ఉన్నా.. ప్రస్తుతం నలుగురిని కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకుంటారని, మైనారిటీ కోటాను తర్వాత భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఇంతమంది పోటీలో ఉండగా వారిని కన్వీన్స్ చేయడం రేవంత్‌రెడ్డికి కత్తిమీద సాము లాంటిదే. అయితే కొందరికి పీసీసీలో కీలక పదవులు ఇచ్చి సంతృప్తి పరుస్తారని అంటున్నారు. మొత్తానికి త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండటంతో నేతల్లో హుషారు వచ్చేసింది.