ఆ ఎంపీ స్థానం గెలవాల్సిందే.. రాజనరసింహకు హైకమాండ్‌ టాస్క్‌

-

తెలంగాణలో మెదక్‌ పార్లమెంట్‌ స్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. కాంగ్రెస్‌ పార్టీకి పట్టున్న ఎంపీ స్థానం ఇది. ఇక్కడి నుంచే మాజీప్రధాని ఇందిరాగాంధీ, మాజీముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, సినీనటి విజయశాంతి వంటి ప్రముఖులు ఎంపీలుగా గెలిచారు. ఇప్పుడు సోనియా గాంధీ సౌత్‌ నుంచి పోటీ చేయాలనుకుంటే కాంగ్రెస్‌ వర్గాలు ఇస్తున్న ఇప్షన్‌ కూడా ఇదే. 1998 వరకు మెదక్‌లో కాంగ్రెస్‌ హవా అప్రతిహతంగా సాగింది. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వరుసగా బీఆర్‌ఎస్‌ గెలుస్తూ వస్తోంది.

పదేళ్ళ తరువాత రాష్ట్రంలో ప్రభుత్వంను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా పెద్ద ఎత్తున్న ఎంపీ సీట్లను గెలవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ లోక్‌సభ స్థానాన్ని గెలవాలని నిర్ణయం తీసుకుంది. ఈ సీటును కాంగరెస్‌ ఖాతాలో వేసే బాధ్యతను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహపై పెట్టింది హైకమాండ్‌. ఇప్పటికే ఆయనను మెదక్ లోక్ సభ ఎన్నికల కోఆర్డినేటర్‌గా నియమించారు. మరో రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారు.

మెదక్ లోక్​సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 చోట్ల బీఆర్‌ఎస్‌ విజయ కేతనం ఎగురవేసింది. సంగారెడ్డి, పటాన్​చెరు, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేటలలో బీఆర్ఎస్ ​అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.కేవలం ఒక్క మెదక్ ​అసెంబ్లీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్​ అభ్యర్థి గెలిచారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు, మెదక్​ మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచిన గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు లభించిన ఓట్లలో భారీ వ్యత్యాసం ఉంది. ఈ నేపథ్యంలో మెదక్ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అంత సులువయ్యే పరిస్థితి కనిపించడం లేదు.ఈ విషయాన్ని గమనించిన మంత్రి దామోదర రాజనర్సింహ మెదక్ పార్లమెంట్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారు.

మెదక్ లోక్​సభ స్థానంలో గెలుపొందాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుని, తదనుగుణంగా లోపాలు సరిదిద్దుకోవాలని మంత్రికి సీనియర్‌లు సలహాలు ఇచ్చారు. వారి సూచనల ప్రకారమే కాంగ్రెస్ పార్టీలోని గ్రూప్ పాలిటిక్స్ ని చక్కదిద్దే పనిలో పడ్డారు మంత్రి రాజనరసింహ. ముందుగా ఈ సమస్యపైనే దృష్టి సారించారాయన. నాయకులు కలిసి పనిచేయకపోవడమే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెదక్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ​నాయకులందరిని ఏకతాటి మీదకు తీసుకురావడం అనేది దామోదర రాజనర్సింహ ముందున్న పెద్ద టాస్క్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఇంకా అమలుకాకపోవడం కూడా ఒక సమస్యే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మెదక్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం దామోదర రాజనర్సింహ ఎలాంటి వ్యూహ రచన చేస్తున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news