ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే ఈ నెల 7వ తేదీ నుంచి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తామని తెలిపారు. గాంధీ భవన్‌లో మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరగ్గా అందులో ఉత్తమ్ మాట్లాడారు.
ముందస్తు ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఈ నెల 9వ తేదీన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సమావేశాలను పెడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో ఓటరు జాబితా సవరణను క్రియాశీలంగా చేయాలని బూత్ కమిటీ అధ్యక్షులను ఆదేశించామన్నారు. కొత్తగా ఓటు హుక్కు పొందిన వారిని ఓటరు జాబితాలో నమోదు చేసేలా కార్యక్రమాలు చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.
ఎప్పటికప్పుడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉందన్న ఉత్తమ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌లో 20 లక్షల మంది ఓటర్లు తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితాను ఎవరైనా టాంపరింగ్ చేస్తున్నారేమోనన్న అనుమానం తమకు కలుగుతుందన్నారు.