కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు ఈ నాలుగు జిల్లాలను కలుపుతూ.. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటికప్పుడు… మూడు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. గతంలో అనేక మంది ఈ ఉద్యమాన్ని తెరమీదికి తెచ్చారు. సాగు, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి, పారిశ్రామికంగా అబివృద్ది లేక పోవడం వంటి కారణాలతో ఈ నాలుగు జిల్లాల్లో అభివృద్ధి కుంటు పడిన మాట వాస్తవమే. ఈ క్రమంలోనే తమకు ప్రత్యేకంగా రాష్ట్రం ఇవ్వాలనేది ఇక్కడి వారి డిమాండ్. ఉమ్మడి రాష్ట్ర విభజన, తెలంగాణ ఏర్పాటు సమయంలోనూ కర్నూలును తెలంగాణలో కలపాలని, లేదా ప్రత్యేక రాష్ట్రంగా ఈ నాలుగు జిల్లాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది.
ఈ క్రమంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక రాయలసీమ పార్టీ కూడా ఏర్పాటై.. నిరాహారదీక్షలు, ఉద్యమాలు అంటూ హడావుడి చేయడం, పోలీసులు కేసులు పెట్టి అరెస్టు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే.. ఇది దశదిశ లేకుండా పోవడం.. నేతలు కలిసి రాకపోవడం తెలిసిందే. ఇక, ఇప్పుడు మరోసారి.. ఈ ఉద్యమం.. అధికార వైసీపీ నుంచే తెరమీదికి రావడం సంచలనంగా మారింది. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని.. సీఎం జగన్ ప్రకటించిన తర్వాత.. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని, న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఫలితంగా అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం జగన్ వెల్లడించారు. ఇది కరువు సీమను తేరుకునేలా చేస్తుందన్నారు.
అయితే.. ఇప్పుడు వైసీపీకే చెందిన గంగుల ప్రతాప్ రెడ్డి .. వైసీపీ మాజీ నాయకులు ఎంవీ మైసూరా రెడ్డి, 2014లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి తదితరులు ఏకమయ్యారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో గంగుల ఏకంగా గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు వెనుక ఉన్న కారణాలు వివరిస్తూ.. ఓ పుస్తకాన్నే రాశారు. దీనిని మైసూరారెడ్డి ఆవిష్కరించారు. అయితే.. ఇంతవరకు బాగానే ఉన్నా.. సీమ ఉద్యమాలు పెద్దగా లోతుగా వెల్లడైన పరిస్థితి మనకు గతంలో కనిపించదు.
అంతేకాదు, బైరెడ్డి ప్రారంభించిన ఉద్యమం కూడా నిలబడలేదు. దీంతో ఇది మాత్రం ఏమేరకు సక్సెస్ అవుతుందనేది ప్రధాన ప్రశ్న. కొసమెరుపు ఏంటంటే.. దినేష్‌రెడ్డి ఏకంగా మరో రెండు జిల్లాలను కలుపుతూ.. సీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నారు. అవి నెల్లూరు, ప్రకాశం. మరి ఈ జిల్లాల వారు ఒప్పుకొంటారా? ఇది ముందుకు సాగేనా? అనే ప్రశ్నలకు చెప్పకనే చెప్పినట్టు సమాధానం వినిపిస్తుండడం గమనార్హం.