చంద్రబాబు కోర్టుకు హాజరు కావాల్సిందే – ధర్మాబాద్ కోర్టు

-

  • రీకాల్ పిటిషన్ తిరస్కరణ
  • అక్టోబర్ 15న హాజరు తప్పనిసరి

Dharmabad court's ultimatum to Chandrababu Naidu

అమరావతి (ధర్మాబాద్, మహారాష్ట్ర) : బాబ్లీకేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైంది. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు శుక్రవారం దాఖలు చేసిన రీకాల్ పిటిషన్ను ధర్మాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. అదే సమయంలో చంద్రబాబునాయుడు అక్టోబరు 15న కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో చంద్రబాబుతో సహా మరో 19 మందికి ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా వారిలో తెలంగాణకు చెందిన గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాశ్ గౌడ్లు నేడు కోర్టుకు హాజరయ్యారు. అయితే చంద్రబాబు తన తరపున న్యాయవాదులను పంపించి రీకాల్ పిటిషన్ దాఖలు చేయించారు.

ఈ పిటిషన్పై వాదనలు వినిపించిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమకు ఎటువంటి నోటీసులు అందలేదని తెలిపారు. అంతేకాకుండా నాలుగు వారాల గడువు కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తాము ఎవరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అయినా మినహాయింపు ఇవ్వలేమనింది. కోర్టుకు హాజరైన గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాశ్ గౌడ్లకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. నోటీసులు అందుకున్న మిగిలిన 16మంది(చంద్రబాబుతో పాటు) ఆ రోజున కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది.

రాజకీయ లబ్ధికోసమే- వైసీపీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ లభ్ది కోసమే బాబ్లీ కేసును ఉపయోగించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయని.. వాటిపై స్టేలు ఎలా తెచ్చుకున్నారని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజే చేయడంలో ఆయన దిట్ట అని అభివర్ణించారు. కింది స్థాయి నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబుకు చుట్టాలేనని తెలిపారు. చిన్న కేసును పట్టకుని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news