రోజాను పదవి నుంచి కావాలనే తప్పించారా?

సినీ నటిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్ రోజా. కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రజెంట్ టెలివిజన్ హోస్ట్‌గా, నగరి ఎమ్మెల్యేగా రెండు పాత్రలు పోషిస్తుంది. తనదైన శైలిలో వాడీ వేడి మాటలతో రాజకీయం చేస్తున్న రోజు ప్రస్తుతం ప్రతీ రోజు టీడీపీని విమర్శిస్తోంది. కానీ, అదే టీడీపీతో ఆమె రాజకీయ అరంగేట్రం జరిగింది. ఆనాటు టీడీపీ తెలుగు మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పని చేసింది. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీ నుంచి వైసీపీలో చేరింది. వైసీపీలోనూ మంచి పేరు సంపాదించుకుని నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే‌గా గెలుపొందింది. వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా నిలిచింది.

ఈ క్రమంలో జగన్ మంత్రివర్గంలో రోజా మంత్రి కావాలనుకుని ఆమె అనుచరులు ఆశపడ్డారు. కానీ, వారికి నిరాశే ఎదురైంది. కాగా, తర్వాత కాలంలో జగన్ రోజాకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవి ఇచ్చారు. తాజాగా ఆ పదవి నుంచి తొలగించడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశమవుతోంది.

వైసీపీలో బలమైన మహిళా నేతగా మహిళా విభాగం కార్యకలాపాలు చూసుకుంటూ సీఎం జగన్‌కు ఆత్మీయురాలిగా ఉన్న రోజా పదవి ఊడటంలో తెరవెనుక ఎవరి పాత్ర ఉందనే చర్చ సాగుతున్నది. కొంతకాలంగా కొందరు సొంత పార్టీ వారే చిత్తూరు వైసీపీలో ఆమెను ఒంటరిచేయాలని చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, రోజా మధ్య కొంత కాలం మాటల యుద్ధం సాగింది. కాగా, వారిద్దరి మధ్య నగరి మున్సిపల్ ఎలక్షన్ టైంలో సయోధ్య కుదిరింది. ఇకపోతే జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనూ రోజాకు విభేదాలున్నట్లు వార్తొలచ్చాయి. అయితే, అలాంటిదేమే లేదని రోజానే సంజాయిషీ ఇచ్చారు. సయోధ్య చిహ్నంగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి రాఖీ కట్టడం కూడా మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ పార్టీ వర్గాల్లో చీలిక ఉందని, కొందరు కుట్ర చేసే రోజాను పదవి నుంచి తప్పించారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయమై రోజా స్పందన ఎలా ఉండబోతుంది? సీఎం జగన్ రోజాకు మళ్లీ ఏదైనా పదవి ఇస్తానని చెప్తారా? అనే విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.