కొత్త జిల్లా కేంద్రం పై వైసీపీ ఎమ్మెల్యేల వార్

-

పశ్చిమ గోదావరి జిల్లా అధికార పార్టీ నేతల మధ్య కొత్త జిల్లాల ఏర్పాటు చిచ్చు రాజేస్తోంది. వారిద్దరు పక్క పక్క నియోజకవర్గాల వారే పైగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు..చెట్టాపట్టాలేసుకు తిరిగే వీరిద్దరి మధ్య జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలన్న అంశం గ్యాప్‌ తీసుకొస్తుందట. ఎవరికి వారు తమ ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని ప్రయత్నించడమే కొత్త వివాదానికి తెరతీసినట్టు చెబుతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కొత్తగా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదట. నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ఉంచాలని కొందరు ప్రతిపాదిస్తుండగా.. ఇంకొందరు నరసాపురం వైపు మొగ్గు చూపుతున్నారట. వాస్తవానికి పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రాలుగా ఏవి ఉంటే అవే కొత్త జిల్లా కేంద్రాలు కాబోతున్నాయని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కానీ అధికార పక్షం ఎమ్మెల్యేల మధ్య మాత్రం ఈ విషయంలో సయోధ్య కుదరడం లేదట.

నరసాపురం బదులుగా అన్ని వనరులకు కేంద్రంగా ఉన్న భీమవరంను జిల్లా కేంద్రం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్నారు. అదే విషయాన్ని సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఎమ్మెల్యే గ్రంధి ప్రయత్నాలు తెలుసుకున్న నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు మరికొందరు వైసీపీ సీనియర్‌ నాయకులు మండిపడుతున్నారట. నరసాపురంలో ఇప్పటికే సబ్‌కలెక్టర్‌ ఆఫీస్‌తోపాటు కొత్తగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆఫీసులు నెలకొల్పడానికి అవసరమైన స్థలం అందుబాటులో ఉందని చెబుతున్నారట. సముద్రతీర ప్రాంతం కూడా కలిసి వస్తుందని వాదిస్తున్నారట. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేస్తే స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులపై ఓ నివేదికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

ఇదే సమయంలో భీమవరంలో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నివేదికలు అందజేయాలని ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. దానికి అనుగుణంగానే కొన్ని శాఖలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా సేకరించారట అధికారులు. పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలు ఏర్పాటైతే పశ్చిమగోదావరి జిల్లా కనుమరుగు కానుంది. ఏలూరు, నరసాపురంలు కొత్త జిల్లాలుగా అవతరిస్తాయి. ఏలూరు జిల్లా కేంద్రమైనా ఇబ్బంది ఉండదు. ఇప్పటికే జిల్లా కేంద్రంగా ఉంది. నరసాపురం పరిధిలోనే భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

గ్రంధి శ్రీనివాస్‌, ప్రసాదరాజుల మధ్య సయోధ్యకు ఓ మంత్రి విఫలయత్నం చేసినట్టు సమాచారం. జిల్లా కేంద్రంతోపాటు రెవెన్యూ డివిజన్ల విషయంలోనూ ఇద్దరి మధ్య సఖ్యత లేదని పార్టీ వర్గాల టాక్‌. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తే… భీమవరాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మార్చాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారట. వీటికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయట. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మాత్రం భీమవరాన్నే జిల్లా కేంద్రం చేయాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. వీరి వివాదంలో ఎవరి మాట నెగ్గుతుందో అన్న చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news