వైఎస్సార్‌ని ఓటమి అంచుకు తీసుకెళ్లిన నాయకుడు ఎవరో తెలుసా? 

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి….తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు ఓ క్రేజ్ ఉంది. కోట్లాది పేదల గుండెల్లో కొలువై ఉన్న పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడు. ఓటమి ఎరగని నేత. పలుమార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, సీఎంగా తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు చేసిన వైఎస్సార్…మరణించినా కూడా….ఆయన చేసిన సేవల్లో ఇంకా బ్రతికే ఉంటారు.

అయితే ఓటమి ఎరగని నేతగా ఉన్న వైఎస్సార్‌ని ఓ నాయకుడు ఓటమి అంచుకు తీసుకెళ్లారు. యువ నాయకుడుగా కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైఎస్సార్…1978 ఎన్నికల్లో తొలిసారిగా పులివెందుల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.  ఆ తర్వాత టీడీపీతో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించిన 1983, 1985 ఎన్నికల్లో కూడా పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి సత్తా చాటారు. ఇక 1989 ఎన్నికల్లో వైఎస్సార్ రూట్ మార్చి, కడప ఎంపీగా బరిలో దిగి విజయం సాధించారు.

తర్వాత రాజీవ్ గాంధీ మరణం నేపథ్యంలో వచ్చిన 1991 ఎన్నికల్లో దాదాపు 4 లక్షల పైనే మెజారిటీతో గెలిచారు. కానీ 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అప్పుడు రాష్ట్రంలో టి‌డి‌పి వేవ్ చాలా బలంగా ఉంది. ఈ క్రమంలో కడప ఎంపీగా పోటీ చేసిన వైఎస్సార్‌కు టి‌డి‌పి తరుపున బరిలో నిలిచిన కందుల రాజమోహన్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. వైఎస్సార్ సులువుగా విజయం సాధిస్తారని అంతా అనుకున్నారు. కానీ కందుల దెబ్బకు వైఎస్సార్ ఓటమి అంచుకు వచ్చారు.

చివరి రౌండ్లలో ఆధిక్యం దక్కించుకుని వైఎస్సార్ 5 వేల మెజారిటీతో ఎలాగోలా గట్టెక్కారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్ 368,611 ఓట్లు సాధించగా, కందుల రాజమోహన్ రెడ్డికి 363,166 ఓట్లు పడ్డాయి. దీంతో వైఎస్సార్ 5,435 ఓట్ల స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు. అసలు వైఎస్ రాజకీయ జీవితంలో ఓటమి అంచుల వరకు తీసుకెళ్లిన ప్రత్యర్ధి రాజమోహన్ రెడ్డే.