ఏపీలో ముందస్తు ఎన్నికలు రావచ్చు – సీఎం జగన్‌

-

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలపై బాంబ్‌ పేల్చారు. రాష్ర్టంలో ముందస్తు రావచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతో తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో సమావేశమైన సీఎం….ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి మొదటివారంలోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మంత్రులను ఆదేశించారు. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరింతగా కష్టపడి పనిచేయాలని ఆదేశించారు. రెండోసారి ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉన్నట్టుండి ముందస్తుపై సీఎం చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి.

ఏప్రిల్‌ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని నిన్న విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ వెల్లడించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో టెన్త్‌,ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షల షెడ్యూల్‌ను మార్చిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ప్రకటన వెలువడి 24 గంటలు పూర్తి కాకముందే ముఖ్యమంత్రి చేసిన ముందస్తు ఎన్నికల ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ముందస్తుకి అసలు అవకాశమే లేదని ఇదివరకే వైసీపీ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

నిర్ణీత సమయంలోనే ఎన్నికలు ఉంటాయని చెప్తూ వచ్చారు. అయితే ఇప్పటికిప్పుడే ముందస్తు ఎన్నికలపై సూత్రప్రాయంగా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ప్రతిపక్షాన్ని అయోమయానికి గురిచేయడం కోసమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అధికార పక్షంపై టీడీపీ,జనసేన నేతలు విరుచుకుపడుతున్నారు. రోజుకొక ప్రకటనతో అటు ప్రజలను కూడా గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

గత వారం రోజుల నుంచి ఏపీలో వైసీపీ ప్రక్షాళన ప్రక్రియ ఊపందుకుంది. నియోజకవర్గ ఇన్‌చార్జులను మార్చడం,కొత్తవారిని తెరమీదకు తీసుకురావడం వంటి కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి.ఇదంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్‌ తన టీమ్‌ని సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రెండోసారి అధికార పీఠం దక్కించుకునేందుకు సీఎం క్షేత్రస్థాయిల నుంచి మార్పులకు శ్రీకారం చుట్టారనేది వారు చెప్తున్న మాట.ఫిబ్రవరి మొదటివారంలో పనులు పూర్తయితే ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడిగేందుకు వీలు కలుగుతుందని కేబినెట్‌ మీటింగ్‌లో సీఎం ఈ మేరకు మంత్రులకు స్పష్టం చేశారు. అందరూ పనులు పూర్తి చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని వారికి సంకేతాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news