ఎచ్చెర్ల ఎటువైపు? కళాని గెలిపిస్తారా? మళ్లీ వైసీపీకే పట్టం కడతారా?? 

-

ఎన్నికలు అనగానే కొన్ని నియోజకవర్గాలపై అందరికీ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు, ఎవరు గెలుస్తారు అని ఆసక్తితో ఎదురుచూస్తూ ఉంటారు. అటువంటి నియోజకవర్గాలలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎచ్చెర్ల నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులందరూ పోటీ చేసి, విజయం సాధించి మంత్రులుగా కూడా పనిచేశారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ వైసీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి టి‌డి‌పి సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతి పలుసార్లు గెలిచారు.

టిడిపి సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకట్రావు ఎచ్చెర్ల నియోజకవర్గం నుండి 2014లో విజయం సాధించారు. అప్పుడు మంత్రిగా చేశారు. కానీ 2019లో గొర్ల కిరణ్ కుమార్ చేతిలో పరాజయం పొందారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో టిడిపి ఎవరిని నిలబెట్టాలో అనే ఆలోచనలో పడింది. కళా వెంకట్రావుకు స్థానికత విషయంలో నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. ఎచ్చెర్ల నియోజకవర్గం కలిశెట్టి అప్పలనాయుడుకు టిడిపి టికెట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కలిశెట్టి అప్పలనాయుడు నియోజకవర్గం పరిధిలో పార్టీ కార్యక్రమాలలో, సేవా కార్యక్రమాలలో చురుకుగా ముందుకు దూసుకుపోతున్నారు

సిట్టింగ్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ పై ప్రజలలో స్థానిక నాయకులలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి చిన్న పనికి డబ్బులు ఆశిస్తున్నారని, ఏ పనికి ఎంత రేటు అని ముందే నిర్ణయించి మరి తీసుకుంటున్నారని గొర్ల కిరణ్ కుమార్ పై ఆరోపణలు ఉన్నాయి. కిరణ్ కుమార్ కు ఈసారి టికెట్ ఇస్తే సొంత పార్టీ నేతలే ఓడిస్తామని బహిరంగంగా చెబుతున్నారు. గొర్లె కిరణ్ కుమార్ ను మార్చాలని ఆలోచనలో వైసిపి ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ స్థానంలో మజ్జి శ్రీను అలియాస్ చిన్న శ్రీనును నిలబెట్టాలని ఆలోచనలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

చిన్న శ్రీను ని పోటీకి నిలబెడితే కళా వెంకట్రావు గెలుపు కష్టమే. అదే చిన్న శ్రీను పై అప్పలనాయుడును పోటీగా నిలబెడితే ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా ఉంటుందని, గెలుపు ఎవరికి వస్తుందో చెప్పడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ కళా వెంకట్రావుని టిడిపి తరఫున, గొర్ల కిరణ్ కుమార్ ని వైసిపి తరఫున నిలబెడితే కళా వెంకట్రావు విజయం సునాయాసమే.

మరి ఎచ్చెర్లలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులుగా ఎవరిని నిలబెడతారో, విజయం ఎవరిని వరిస్తుందో, గెలిచేది టిడిపి నా వైసీపీ నా వేచి చూడాల్సిందే!

Read more RELATED
Recommended to you

Latest news