పథకాలు ఎన్నింటిని ప్రకటించి అమలు చేసినా ఫలితాలు మాత్రం అస్సలు అనుకూలంగా లేవు అన్నది జగన్ అంతర్మథనంగానే ఉంది.ఒకవేళ కొత్త పొత్తుల కారణంగా విపక్షం యుద్ధం తీవ్రం చేస్తే తాను ఒంటరిని అయిపోతానని భయం కూడా ఉంది ఆయనకు. అంతేకాదు ప్రధాన మీడియా అంతా టీడీపీ వైపే ఉంది కనుక వాళ్లను ఢీ కొనడం తనకు శక్తి కి మించిన పనే అని జగన్ ఒప్పుకుంటూనే ఉన్నారు. ఈ తరుణంలో మంత్రులు,ఎమ్మెల్యేలు బాగా పనిచేసి తమని తాము నిరూపించుకోవాలని కోరారు.
నిన్నటి వేళ నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశం అనేక సంచనాలకు దారితీసింది.ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ అసంతృప్తిగా ఉన్నారు.ఆయన ఎన్నడూ లేని విధంగా నిన్నటి వేళ స్పందించి పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించారు.రానున్న కాలంలో ప్రధాన మీడియాపై యుద్ధం చేయనున్నామని ఇందుకు అంతా సిద్ధం కావాలని కూడా చెప్పారు.ముఖ్యంగా టీడీపీకి అనుగుణంగా ఉన్న మీడియా కొన్ని అసత్య కథనాలు జనంలోకి తీసుకువెళ్తోందని వీటిని తిప్పికొట్టాలని అన్నారు.ఏప్రిల్ రెండు నుంచి గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం మొదలు కానుందని, డోర్ టు డోర్ ఎమ్మెల్యేలు తిరిగి పనితీరు మెరుగు పర్చుకోవాలని,లేదంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చేదే లేదని తేల్చేశారు.
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు సంబంధించి కూడా జగన్ స్పష్టమయిన ప్రకటన ఒకటి చేశారు. ఇప్పటివరకూ పనిచేసిన మంత్రులను తప్పించాక కొత్త వాళ్లను తీసుకుంటామని, అలా అని పాత మంత్రులు బాధపడాల్సిన అవసరం లేదని పార్టీలో వారికి సముచిత స్థానం ఉంటుందని అన్నారు. కుల సమీకరణాల రీత్యా కొందరిని కొనసాగిస్తామని మిగతావారిని మారుస్తామని అన్నారు. పార్టీ కోసం పనిచేయండి మీరు గెలవండి పార్టీని గెలిపించండి అని స్పష్టం చేశారు.