జనసేనలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ.. రాయలసీమ నుంచి ఎంపీగా పోటీ..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. ఆయన సీబీఐ నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. అప్పుడప్పుడు యూత్ కు ప్రేరణ కలిగించే సెమినార్లలో ఆయన పాల్గొంటారు..

జేడీ లక్ష్మీనారాయణ. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సీబీఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన.. తర్వాత ఆ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని సమాజానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. చాలా రోజుల నుంచి ఆయన రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఆయనే ఓ పార్టీ పెట్టనున్నట్టు ప్రచారం సాగింది. టీడీపీలో చేరుతారని కొన్ని రోజులు పుకార్లు వినిపించాయి. కానీ.. అన్నింటికీ చెక్ పెడుతూ ఆయన జనసేన పార్టీలో చేరారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను వీవీ లక్ష్మీనారాయణ ఇవాళ కలిశారు. ఈసందర్భంగా జనసేనలో చేరుతున్నట్టు లక్ష్మీనారాయణ ప్రకటించారు. పవన్ కళ్యాణ్.. లక్ష్మీనారాయణకు పార్టీ కండువా కప్పి జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు.

అయితే వచ్చే ఎన్నికల్లో లక్ష్మీనారాయణను ఎంపీగా పోటీ చేయించాలని పవన్ భావిస్తున్నారట. ఈనేపథ్యంలో ఆయన్ను రాయలసీమ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట. రాయలసీమ నుంచి ఎంపీగా జేడీని పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు ఆయనకు ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చే విషయంపై ప్రకటన చేస్తామని పవన్ ఈసందర్భంగా వెల్లడించారు.