తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంలో అధికార వైసీపీకి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. గిరిజనుల అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మరోసారి వైసీపీని గెలిపించేందుకు దోహద పడుతున్నాయి.ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13సార్లు ఎన్నికలు జరిగాయి. గడిచిన రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు.ఈసారి కూడా అభ్యర్థిని మార్చి హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు.ఈ మేరకు కసరత్తు చేస్తున్నారు.ఇక ఈ నియోజకవర్గంలో మొత్తం 2,25,007 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 1,11,274 మంది,మహిళా ఓటర్లు 1,13,721 మంది ఉన్నారు.
రంపచోడవరం నియోజకవర్గంలో తొలిసారి 1962లో ఎన్నికలు జరగ్గా తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చోడి మల్లిఖార్జున విజయం సాధించారు.1967లో కూడా చోడి మల్లిఖార్జున మరోసారి గెలిచారు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థి రత్నబాయి,1978లో కాంగ్రెస్ అభ్యర్థి గొర్రెల ప్రకాశరావు ఇక్కడ విజయం సాధించారు. 1983,1985 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చిన్నం జోగారావు ఎమ్మెల్యేగా గెలిచారు.1989,1994 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఎస్ వెంకటేశ్వరరావు విజయాన్ని దక్కించుకున్నారు.2004లో టీడీపీ అభ్యర్థి చిన్నంబాబూ రమేష్,2009లో కాంగ్రెస్ అభ్యర్థి కె సత్యనారాయణ విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థి వి రాజేశ్వరి, 2019లో వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి గెలుపొందారు. మొత్తానికి ఐదుసార్లు కాంగ్రెస్, ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, గడిచిన రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు.
రానున్న ఎన్నికల్లో ఇక్కడ పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉండనుంది. ఇరు పార్టీలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే మరోసారి తలపడే అవకాశముందని చెబుతున్నారు. కానీ మళ్లీ ఇక్కడ కొత్త మహిళా అభ్యర్థిని రంగంలోకి దించేందుకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు.మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న రంపచోడవరంలో విజేతను నిర్ణయించడంలో ప్రతిసారీ వారే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడ పోరు రెండు ప్రధాన పార్టీల మధ్య ఆసక్తిని రేకెత్తిస్తోంది.