అద్దం కి అదృష్టం ఈ సారైనా బాగుంటుందా…తుంగతుర్తిలో కారుకు చెక్ పడుతుందా?

-

అద్దంకి దయాకర్…తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు. పార్టీ తరుపున బలమైన వాయిస్ వినిపించే నాయకుడు. మీడియా సమావేశాలు కావొచ్చు…టి‌వి డిబేట్లు కావొచ్చు, బహిరంగ సభలు కావొచ్చు అనర్గళంగా మంచి సబ్జెక్ట్ మాట్లాడగల నాయకుడు. అయితే ఇలా ఫైర్ బ్రాండ్ నాయకుడుగా ఉన్న అద్దంకికి అదృష్టం కాస్త తక్కువగానే ఉందని చెప్పొచ్చు.

ఎందుకంటే గత రెండు పర్యాయాలు స్వల్ప మెజారిటీ తేడాతోనే ఓటమి పాలవుతూ వస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో అద్దంకి దయాకర్, నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి కిశోర్‌పై ఓటమి పాలయ్యారు. రెండు సందర్భాల్లోనూ అద్దంకి దయాకర్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2014లో 2,379 ఓట్ల తేడాతో, 2018లో 1,847 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

ఇలా రెండుసార్లు అద్దంకికి అదృష్టం కలిసిరాలేదు. అయితే ఇలా అద్దంకికి అదృష్టం కలిసి రాకపోవడానికి ప్రధాన కారణం సొంత పార్టీ నాయకులే. తుంగతుర్తి నియోజకవర్గం అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి కంచుకోట. 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో నాలుగుసార్లు తుంగతుర్తి నుంచి దామోదర్ రెడ్డి గెలిచారు. కానీ ఆ తర్వాత తుంగతుర్తి ఎస్సీ రిజర్వడ్‌గా మారడంతో దామోదర్, సూర్యపేటకు వెళ్ళిపోయారు. 2009లో సూర్యపేట నుంచి దామోదర్ గెలిచారు.

ఇక 2009లో తుంగతుర్తిలో టి‌డి‌పి తరుపున మోత్కుపల్లి నరసింహులు విజయం సాధించారు. 2014లో కాంగ్రెస్, టి‌ఆర్‌ఎస్‌ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో ఉన్న దామోదర్ వర్గం, అద్దంకికి సపోర్ట్ ఇవ్వకపోవడంతో, స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో దామోదర్…తన అనుచరుడు వడ్డేపల్లి రవికి టికెట్ ఇప్పించుకోవాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అద్దంకికి టికెట్ ఇచ్చింది. దీంతో రవి ఇండిపెండెంట్‌గా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోయి, అద్దంకి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఈ సారి దామోదర్ వర్గానికి అద్దంకి దాదాపు చెక్ పెట్టేసినట్లు కనిపిస్తోంది. పైగా కాంగ్రెస్ తరుపున ఫుల్ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. అటు టి‌ఆర్‌ఎస్‌పై వ్యతిరేకత కాస్త పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి తుంగతుర్తిలో అద్దంకికి అదృష్టం కలిసొచ్చేలా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news