అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కోనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, వైకాపా, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే పార్టీలతో సంబంధం లేకపోయిన స్థానిక ఎన్నికలను సైతం టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టోను సైతం విడుదల చేశారు.
ఇలాంటి కీలక తరుణంలో టీడీపీకి మరో గట్టిదెబ్బ తగిలింది. విజయనగరం జిల్లా టీడీపీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి పడాల అనిత తెలుగుదేశానికి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని చంద్రబాబుకు పంపారు. ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పార్టీ సీనియర్ నేత ఆ పార్టీని వీడటం గట్టి దెబ్బ అని చెప్పవచ్చు. దాదాపు 34 ఏండ్లుగా ఆమె టీడీపీకి సేవలు చేశారు.
కాగా, ఆమె టీడీపీని వీడటానికి ప్రధానం కారణం రాష్ట్ర కమిటీలో చోటు కల్పించకపోవడమేనని తెలుస్తోంది. పడాల అనిత సైతం మాట్లాడుతూ.. చాలా ఏండ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదని వాపోయారు. అందుకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఆమె త్వరలోనే బీజేపీ గూటికి చేరనున్నారని తెలుస్తోంది.