ఎచ్చెర్ల ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హవా కంటే షాడో ఎమ్మెల్యే హవానే ఎక్కువనడుస్తుందట..అదేంటి అనుకుంటున్నారా? అసలు కంటే కొసరు ముద్దన్నట్లు.. అందరకీ ‘షాడో’నే కావాలి. ఈయన ఓకే అంటేనే అసలాయన దర్శనం కలుగుతుందట. తీరా ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే.. అంతా ఆయనే చూసుకుంటారని చెప్పి పంపించేస్తున్నారట. సిక్కోలులో ఆ ఎమ్మెల్యే పై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
సిక్కోలులో ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జిల్లాకు ముఖద్వారమైన ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా.. ఆసక్తిగా సాగుతుంటాయి. మొన్నటి ఎన్నికల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు.. అప్పటి మంత్రి కళా వెంకట్రావ్‌ను ఓడించి తొలిసారి వైసీపీ జెండాను రెపరెపలాడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు గొర్లె కిరణ్ కుమార్. ఇదే కిరణ్ కుమార్ 2014లో కళా చేతిలో ఓడిపోయారు. 2019లో ఆ ఓటమికి బదులు తీర్చుకున్నారు.
ఇంతవరకూ బాగానే ఉన్నా..ఎచ్చెర్ల లో ఎమ్మెల్యే మాట పెద్దగా చెల్లుబాటు అవ్వడం లేదన్న టాక్ బలంగా వినిపిస్తోందట. దశాబ్దన్నరకాలంగా కిరణ్‌కుమార్‌కు అండగా.. తలలో నాలుకలా ఉంటూ వస్తున్న ఆయన బావమరిది పిన్నింటి సాయి హవా కొనసాగుతోందట. కిరణ్ ఎమ్మెల్యే అయినప్పటికీ.. అజమాయిషీ అంతా బావమరిదిదే అట. నియోజకవర్గంలో ఏ చిన్నపని జరగాలన్నా.. అధికార, అనధికార కార్యక్రమాలు, ఆఖరికి పార్టీ శ్రేణులైనా ముందు బావమరిదిని దాటితే కానీ ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లలేకపోతున్నారట. దీంతో తొమ్మిదేళ్లపాటు వైసీపీనే నమ్ముకుని పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషం కార్యకర్తల్లో ఏమాత్రం కనిపించడం లేదట. గడచిన ఏడాదిన్నర కాలంగా ఎచ్చెర్లలో సాయి కటాక్షం ఉంటేనే ఎమ్మెల్యే దర్శనం అన్న చందంగా పరిస్థితులు ఉన్నాయట.
నియోజకవర్గంలోని ప్రతీ మండలంలోనూ, గ్రామాల్లోనూ పార్టీ క్యాడర్‌నే సాయి క్యాడర్ అనేలా ఉన్నాయట పరిస్థితులు. కొత్తగా బయట నుంచి వచ్చిన వారికి, ఆర్థికంగా బలం ఉన్నవారికే ఎమ్మెల్యే బామ్మర్దిగారి సపోర్టు ఉండటంతో పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయట. మొన్నామధ్య లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి.. నామినేషన్ల దాఖలు సందర్భంగా అంతా తానై నడిపించారట సాయి. కరోనా పుణ్యమా అని ఆ ఎన్నికలు జరగలేదు కానీ.. జరిగితే వైసీపీకి ఇక్కడ ఓ రేంజ్‌లో దెబ్బ తగిలేదని పార్టీ కేడర్ చర్చించుకుంటోందట.
నియోజకవర్గంలో నాడు-నేడు, రోడ్లు, కాలువలు, డ్రైనేజ్‌లు, కుళాయిలు ఇలా అనేక పనులు సాయి చెప్పిన వారికే కట్టబెట్టారట. ఈ విషయాలన్నీ తెలిసినా ఎమ్మెల్యే ఏమీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. మండలస్థాయి నాయకులు ఏదోలా ఎమ్మెల్యేని కలిసి తమ గోడు చెప్పుకోగలుగుతున్నారు. గ్రామస్థాయి క్యాడర్ మాత్రం ఎమ్మెల్యే మొహం చూసి ఆర్నెల్లు అయ్యిందట. ఎమ్మెల్యే సైతం అంతా బావమరిది చూసుకుంటారని వచ్చిన వాళ్లకు సాయి పేరు చెబుతున్నారట. తమకు ఆ షాడో ఎమ్మెల్యే బాధ ఎప్పుడు తప్పుతుందోనని తలపట్టుకుంటోందట కేడర్. ఇంకొందరైతే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట. మొత్తానికి ఎచ్చెర్ల ఎమ్మెల్యే తీరు పార్టీ వర్గాల్లోనే చర్చకు దారితీస్తోంది.