గొర్రెల కాపరిపై మాజీ ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యం

చింతమనేని ప్రభాకర్‌.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల గురించి అవగాహన ఉన్న ఎవ్వరికైనా ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చింతమనేని చేసిన దారుణాలు, దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కావు. అధికారులను సైతం లెక్కపెట్టని వ్యక్తిత్వం చింతమనేని ప్రభాకర్‌ది. అయితే ప్రస్తుతం ప్రభాకర్‌ పదవిలో లేకపోయినా కూడా ఇష్టప్రకారం రెచ్చిపోతున్నారు. జనం ఛీకొట్టి మూలనబెట్టినా, ఓ వైపు పాతకేసులు వెంటాడుతున్నా బుద్ధి మాత్రం రాటడం లేదు. ఇటీవల ఓ కేసు విషయంలో అరెస్ట్‌ అయి స్టేషన్లో కూడా ఉండొచ్చారు. అయినా ఈ దెందులూరు దాదా,టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు బలుపు తగ్గలేదనే చెప్పాలి.

తన కంటే కింది స్థాయివాళ్ళు కనిపిస్తే చాలు దాడులకు పాల్పడటం,అవమానించడం అలవాటుగా మారింది. ఎస్సీ,ఎస్టీలను కులం పేరుతో దూషిస్తూ మీకెందుకు రాజకీయాలు అని ఏకవచన పదాలతో మాట్లాడటం ఈ దాదకే చెల్లింది. గతంలో ఎస్సీలనుద్దేశించి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఓట్లు వేయండి చాలు….మీకు రాజకీయాలు వద్దు అని అహంకార పూరితంగా మాట్లాడిన చింతమనేని ప్రభాకర్ ఇంకా అదే బలుపుతో ఉన్నారు. నిబంధనలు పట్టించుకోకుండా అటవీ భూముల్లో రోడ్లు వేస్తున్నందుకు అడ్డుకున్నారని అటవీ సిబ్బందిని కొట్టిన సంగతి తెలిసిందే.అలాగే ఇసుక దందాను ఆపినందుకు మహిళా ఎమ్మార్వోను జుట్టు పట్టుకుని కొట్టిన చింతమనేని ఇంకా అదే పొగరుతో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

తాజాగా పెదవేగి మండలం, రామచంద్రాపురం అడ్డరోడ్డు దగ్గర జరిగిన ఓ సంఘటన అతని బలుపు ఏ లెవల్లో ఉందో తెలియజేస్తుంది. తన జీడి మొక్కల దగ్గరకి గొర్రెలు వెళ్లాయంటూ వీరంకి లక్ష్మీనారాయణ అనే గొర్రెల కాపరిపై చింతమనేని దాడి చేశారు. అటుగా వెళుతున్న చింతమనేని కారు దిగి, లక్ష్మీనారాయణను తిడుతూ ఆయన్ను కింద పడేసి గుండెల మీద తన్నడమే కాకుండా అతని గొర్రెలను దౌర్జన్యంగా తన కార్లో ఎక్కించుకొని తీసుకుపోయాడు. ఈ సంఘటనపై లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవడొస్తాడో చూస్తానని, ఎవడికి చెప్పుకుంటావో, చెప్పుకోమంటూ చింతమనేని బెదిరించాడని పోలీసుల ముందు బాధితుడు భోరుమన్నాడు. అక్కడి టీడీపీ కార్యకర్తలే ప్రత్యక్ష సాక్షులని తన బాధ చెప్పుకున్నాడు.

రామచంద్రాపురం వద్ద జరిగిన ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే, దెందులూరు నియోజకవర్గం గౌడ సంఘం అధ్యక్షుడు మట్టా శంకర్ ఆధ్వర్యంలో ప్రజలు అడ్డరోడ్డు వద్దకు చేరుకొని చింతమనేని కారును అడ్డగించి నిలదీశారు. తాను కొట్టలేదని చెబుతూ, మెల్లగా జారుకున్నాడు చింతమనేని. ఈ సీన్‌ చూసినవారంతా ముక్కున వేలేసుకున్నారు. అంటే పదవిలో లేకపోయినా,జైలుకి వెళ్ళివచ్చినా కూడా పొగరు తగ్గలేదని నియోజకవర్గం ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోసారి ఓడిస్తే తప్ప పొగరు కిందికి దిగదని ప్రజలు అంటున్నారు. మరి బాధితుడి ఫిర్యాదుపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి…..