సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన తెలంగాణ పర్యటనకు వచ్చారు. నారాయణపేటలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కు ఏటీఎం లాగా మారిందని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అవినీతి వల్లనే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు జేపీ నడ్డా.
టిఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఒక కేసీఆర్ కుటుంబానికి లబ్ధి జరిగిందని.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలాలు ప్రజలకు అందడం లేదని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే ఎన్నికలన్నారు. రాబోయే ఎన్నికలు తెలంగాణ స్వరూపాన్ని మార్చే ఎన్నికలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబ పార్టీ పాలనను ఓడించాలని పిలుపునిచ్చారు. బిజెపికి ఓటేసి కేసిఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.