అమరావతి: చిత్తూరు జిల్లా నగరి టిక్కెట్ తమ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదని గాలి ముద్దు కృష్ణమనాయుడు సతీమణి, తనయులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పష్టం చేశారు. తమ కుటుంబానికి కాకుండా వేరొకరికి టిక్కెట్ కేటాయించినా పార్టీ కోసం కృషి చేస్తామని వారు అధినేతకు చెప్పారు. ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్నతో కలిసి గాలి కుటుంబసభ్యులు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు.
నగరి పంచాయితీపై అధినేత చంద్రబాబుతో శనివారం ప్రజావేదికలో సుదీర్ఘ సమావేశం జరిగింది. గాలి కుమారులు భాను, జగదీశ్ టికెట్ తమకు కావాలంటే తమకే కావాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో నియోజకవర్గం నుంచి వచ్చిన దాదాపు 350 మంది ముఖ్యనేతలు, కార్యకర్తల అభిప్రాయాలను చంద్రబాబు సేకరించారు. గాలి కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇబ్బంది లేదని వారంతా అధినేతకు స్పష్టంచేశారు. అయితే గాలి అన్నదమ్ముల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం.. కుటుంబం ఏకతాటిపైకి రావాలని దిశానిర్దేశం చేశారు. దీంతో నిన్న బుద్దా వెంకన్న నివాసంలో వారంతా సమావేశమై ఏకతాటిపైకి వచ్చారు. ఇదే విషయాన్ని సోమవారం చంద్రబాబును కలిసి వివరించారు.