కొన్ని అనివార్య కారణాలతో రాకీయాల నుంచి తప్పుకున్న మాజీ ఎంపీ,ప్రముఖ పారిశ్రామికవేత్త గల్ల జయదేవ్ రీఎంట్రీ కోసం తహతహలాడుతున్నారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ వర్గాలు. తెలుగుదేశం పార్టీ తరపున రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అత్యంత సంపన్నఎంపీల్లో ఒకరుగా ఉండటమే కాకుండా గుంటూరు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు.
అయితే కొన్ని అనివార్య కారణాల వలన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని కేవలం వ్యాపారంపై దృష్టి పెట్టిన జయదేవ్ ఇప్పుడు మళ్ళీ రాజకీయాలపై మనసు లాగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉంది. అలాగే కేంద్రంలోని ఎన్‌డిఏలో కీలక భాగస్వామిగా కూడా టీడీపీ కొనసాగుతోంది. రాజకీయాల్లో మళ్ళీ సత్తా చాటాలంటే ఇదే సరైన సమయం అని జయదేవ్ తన అనుచరుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందుకే పొలిటికల్ రీఎంట్రీపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీమంత్రి అరుణకుమారి కుమారుడు ఈ జయదేవ్.స్వాతంత్ర్య సమరయోథుడు రాజగోపాలనాయుడు మనువడే గల్లా జయదేవ్. ప్రముఖ టాలీవుడ్ హీరో మహేష్‌బాబుకి బావ. గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆ పార్టీ అభ్యర్ధిగా గుంటూరు నుండి పోటీ చేసి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.తండ్రి గల్లా రామచంద్ర నాయుడు కూడా ప్రముఖ వ్యాపారవేత్త. తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం, కరకంబాడి దగ్గర అమరరాజా బ్యాటరీస్ అనే సంస్థ స్థాపించారు. ప్రస్తుతం ఆ కంపెనీ వ్యవహారాలను జయదేవ్ చూస్తున్నారు.
వైసీపీ హయాంలో ప్రభుత్వంతో ఏర్పడిన వివాదంతో ఆయన తన పరిశ్రమను తెలంగాణకు మార్చుకున్నారు. అప్పటినుంచి అక్కడే అమర రాజా బ్యాటరీస్ ఉత్పత్తి జరుగుతోంది. రాజకీయంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న జయదేవ్ మనస్తాపానికి గురై 2024 జనవరి 28న రాజకీయాల నుంచి వైదొలిగారు. అప్పటినుంచి పూర్తిస్థాయి వ్యాపారవేత్తగా మారిపోయారు. రాజకీయాల నుంచి తప్పుకుని సంవత్సరం రోజులు కాకముందే ఆయన పునరాగమనం చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. తన ప్రతిపాదనను చంద్రబాబు వద్ద ప్రస్తావించగా అభినందించి వెల్‌కమ్ చెప్పారట. ఏపీ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారిపోయింది.
గల్లా జయదేవ్ రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక పదవిని రిజర్వ్ చేశారని టాక్ నడుస్తోంది. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన జయదేవ్‌కు కేంద్రంలో మంచి పరిచయాలు ఉన్నాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవిని ఆయనకు ఇస్తే బాగుటుందని, ఏపీని ఢిల్లీ స్థాయిలో రిప్రజెంట్ చేయడానికి ఆయనే సమర్థుడని చంద్రబాబు కూడా భావిస్తున్నారు. దీంతో పోస్ట్‌ను జయదేవ్‌కి కన్‌ఫామ్ చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. 2014-19 సమయంలో కంభంపాటి రామ్మోహన్ రావు ఆ పదవిలో ఉన్నారు.
అటు జయదేవ్ కూడా తనకు ఢిల్లీ ప్రతినిధి పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరుకుంటున్నారు. వ్యాపార పరంగా ఢిల్లీలోనే ఎక్కువ ఉంటున్న కారణంగా ప్రభుత్వం పనులు చేయడానికి ఎక్కువగా సమయం కేటాయించగలరని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రతినిధి పదవి అంటే ఢిల్లీలో పలుకుబడి ఉంటుంది. కేబినెట్ ర్యాంక్ ఉంటుంది.ఎన్‌డీఏలో కీలకంగా ఉన్న చంద్రబాబు ఈ సారి ఢిల్లీ నుంచి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కన్నా.. సమర్థతకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉన్నాయంటున్నారు టీడీపీ వర్గాలు.