ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరు ఉంటారు ఎవరు పార్టీ మారతారు అనే ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే వరుస పర్యటనలు నిర్వహించి కార్యకర్తల్లో ధైర్యం నూరిపోసే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదనే అభిప్రాయం కొందరి నుంచి ఎక్కువగా వినపడుతుంది. ఇక ఇప్పుడు గన్నవరం వ్యవహారం తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేగా ఉన్న వంశీ రాజీనామా చేయడంతో,
ఆ రాజీనామాను స్పీకర్ ఆమోదించే అవకాశం ఉండటంతో నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు నియోజకవర్గం నుంచి ఎవరిని బరిలోకి దించాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా నుంచి ముగ్గురు పేర్లను ఆయన పరిశీలిస్తున్నారని అంటున్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సతీమణి గద్దె అనురాధ, మాజీ జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమా, తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని ఉమా పేరుని అధిష్టానం పరిశీలిస్తుంది.
అయితే ఇక్కడ దేవినేని అవినాష్ వెనకడుగు వేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. వంశీ జగన్ ని కలిసిన రోజే చంద్రబాబు అవినాష్ కి ఫోన్ చేయగా అవినాష్ నుంచి ఆశించిన సమాధానం చంద్రబాబు వద్దకు వెళ్లలేదని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు అవినాష్ ని ఒప్పించే ప్రయత్నం చేసినా ఇప్పటికే తాను గుడివాడ నుంచి భారీగా ఖర్చు చేసానని తన వద్ద అంత స్తోమత లేదని దయచేసి ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబుని అవినాష్ కోరారట. దీనితో చంద్రబాబు గద్దె అనురాధ వైపు మొగ్గు చూపుతున్నారని కార్యకర్తల అభిప్రాయం కూడా తీసుకున్నారని అంటున్నారు.