ఆయన వ్యాపారాలను ప్రేమిస్తారు, రాజకీయాలను శాసిస్తాడు. ఆయనకు అందరూ మిత్రులే. ఎక్కడ పోటీ చేసినా విజయమే. రాజకీయం అంటే ఆయనను చూసి నేర్చుకోవాలి. ప్రజారాజ్యం మూసేసినా ఆయనకు చిరంజీవే పైకి కనపడని నాయకుడు. ఆయన అంటే అదో ప్రత్యేక అభిమానం మరి. జనసేన పార్టీని ఒక్క మాట అనలేరు. టీడీపీ నేతలకు ఆయన అజాత శత్రువు. అధికార పార్టీ నేతలకు అత్యంత సన్నిహితుడు.
ఆయన మీద కేసులు ఉండవు, ఎక్కడ ఉన్నా సరే మా పార్టీలోకి రావాలని ఒత్తిళ్ళు ఉండవు. అది ఆయన ఇష్టం. ఆయన్ను కాదనే వాడు లేదు వద్దనే వాడు అంతకంటే లేడు. ఆయనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. టీడీపీ నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టి… అన్నయ్య చిరంజీవి మీద అభిమానంతో ప్రజారాజ్యంలోకి వెళ్లి, ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం అయితే అందులోకి వెళ్ళారు విద్యాశాఖా మంత్రి అయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుంది అని భావించి ఇక్కడికి వచ్చి కూడా మంత్రి అయ్యారు. ఇలా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆర్ధికంగా బలమైన నేత కావడంతో ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది. ఆయన్ను ఎవరూ వద్దని అనుకోరు కూడా. ఇప్పుడు ఇది పక్కన పెడితే విశాఖ ఉత్తరం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు గంటా. అక్కడ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండనూ ఉంది. కాని గంటా మాత్రం పార్టీకి దూరంగా ఉంటున్నారు.
జనసేన లాంగ్ మార్చ్ కి రాలేదు. ఇప్పుడు విశాఖలో చంద్రబాబుని అడ్డుకుంటే రాలేదు. ఆయన్ను తిప్పి విమానం ఎక్కిస్తే గంటా నుంచి ఏ మాటా బయటకు రావడం లేదు. అసలు గంటా ఉన్నట్టా లేనట్టా అనేది ఎవరికి తెలియడం లేదు. చంద్రబాబు ఆయన్ను పిలవడం లేదు. ఆయన రావడం లేదు. ఆయన్ను ఎందుకు పిలవట్లేదో ఎందుకు రావట్లేదో వాళ్ళ ఇద్దరికే తెలుసు. గంటా ఎక్కడ గంట కొడతారో ఎవరికి అర్ధం కాని పరిస్థితి.