తెలంగాణ ఎన్నికలు హోరాహోరిగా జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గం అన్ని పార్టీలకు కీలకంగానే మారింది. కానీ కొన్ని నియోజకవర్గాలు మాత్రం పార్టీలకు చావో రేవో అన్న విధంగా మారాయి. అటువంటి నియోజకవర్గం ముఖ్యమైనది గోషామహల్.
ఈ నియోజకవర్గం లో అన్ని సామాజిక వర్గాలు ఉన్న ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు హిందూ ముస్లిం, గోరక్ష. ఈ రెండు అంశాలే గోషామహల్ లో విజేతను నిర్ణయిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ వాదంతో బిఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా రెండుసార్లు అధికారం చేపడితే గోషామహల్ లో మాత్రం బిజెపి అభ్యర్థి రాజాసింగ్ మాత్రమే గెలిచారు. ఇప్పుడు కూడా విజయం సాధించాలని బిజెపి నుంచి బరిలో దిగుతున్నారు. రాజాసింగ్ కు పోటీగా బిఆర్ఎస్ నంద కిషోర్ వ్యాస్ ను నిలబెట్టారు. వీరిద్దరి మధ్య హోరా హోరి పోరు ఉంటుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మొగలి సునీత పేరును ప్రకటించినా, ఆమె పేరు వరకే తప్ప పోటీలో లేరని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఓల్డ్ సిటీ లో ఓట్లు,మార్వాడి ఓట్లు కీలకంగా మారతాయి. ఈసారి ఎంఐఎం తన అభ్యర్థిని కూడా నిలబెట్టకపోవడంతో ఆ ఓట్లన్నీ కూడా బిఆర్ఎస్ వైపే పడతాయని బిఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజాసింగ్ మాత్రం నియోజకవర్గంలో తనకు ఉన్న క్యాడర్ తను చేసిన మంచి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరి గోషామహల్ ఈసారి రాజాసింగ్ కు హ్యాట్రిక్ ఇస్తుందా లేక బిఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ కు ఒక ఛాన్స్ ఇస్తుందా వేచి చూడాల్సిందే…