తెలంగాణలో ఎన్నికల సందడి పెరిగింది. అభ్యర్థుల ప్రచారంతో ఓటర్లకు వారిచ్చే హామీలతో పల్లెలన్నీ సందడిగా మారిపోయాయి. కొన్ని నియోజకవర్గాలలో గెలుపు కోసం మూడు పార్టీలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలు గెలవడమే తమ ప్రతిష్టకు గుర్తింపుగా చెప్పుకుంటున్నాయి. అటువంటి నియోజకవర్గాలలో ముఖ్యమైనది సికింద్రాబాద్ నియోజకవర్గం.
ఈ నియోజకవర్గంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల ఓటర్లు ఉన్నారు. కానీ గెలుపును శాసించేది మాత్రం రైల్వే ఉద్యోగుల ఓట్లు మాత్రమే. ఇప్పటికే బిఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ మూడు సార్లు గెలిచారు. నాలుగో సారి గెలిచేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేస్తుంటే, ఈసారైనా సికింద్రాబాద్ లో తమ పార్టీ జెండా ఎగురవేయాలని బిజెపి, కాంగ్రెస్ రెండు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
పద్మారావు గౌడ్ నియోజకవర్గ ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యారని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించడం, దళిత బంధు పథకాన్ని ఇవ్వడంలో బిఆర్ఎస్ విఫలం అయ్యిందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ తరపున సంతోష్ కుమార్ బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతోపాటు రాష్ట్రంలో వేస్తున్న బిఆర్ఎస్ వ్యతిరేక గాలి కూడా ఈసారి తమకు కలిసి వస్తుందని ధీమాతో ఉన్నారు. బిజెపి నుంచి మేకల సారంగపాణి ని బరిలో దించారు. ఇతనికి సికింద్రాబాద్ లో మంచి పట్టుంది. సికింద్రాబాద్ లో బిజెపికి మంచి క్యాడర్ కూడా ఉంది. ఇప్పుడు బిఆర్ఎస్ వ్యతిరేక ఓట్లన్నీ తన వైపే ఉంటాయని కాంగ్రెస్, బిజెపి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరి సికింద్రాబాద్ కోటలో పాగా వేసేది ఎవరో???