ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. ఓవైపు ఎండాకాలం వేడి.. మరోవైపు రాజకీయాల వేడితో ఏపీ అట్టుడుకుతోంది. ముఖ్యంగా అధికారపార్టీ టీడీపీకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే.. టీడీపీకి చెందిన ముఖ్య నేతలు వైసీపీలో చేరగా… తాజాగా.. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీ సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి ఆయా లేఖలను చంద్రబాబుకు, స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు పంపించారు.
గత కొంతకాలంగా ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆయన వైసీపీలో చేరనున్నారని మనలోకం వెబ్ సైట్ కూడా చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది. ఆయన కొన్ని రోజుల నుంచి టీడీపీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు వైఖరిపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతే కాదు.. పార్టీలో తనను ఒంటరిని చేసేందుకు.. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వర్గం ప్రయత్నిస్తుండటం… మోదుగులకు మింగుడుపడలేదు. ఆయనకు పార్టీ నుంచి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. దీంతో ఆయన ఆవేదనకు గురయ్యారు. ఇటీవలే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షను నిర్వహించిన చంద్రబాబు.. మోదుగులను పిలవలేదట. ప్రతిసారీ పార్టీలో ఆయనకు అవమానం జరుగుతుండటం.. ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుండటంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
9న జగన్ సమక్షంలో వైసీపీలోకి..
ఈ నెల 9న మోదుగుల వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ సమక్షంలోనే ఆయన వైసీపీలో చేరనున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి మోదుగుల నరసరావుపేట ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత తిరిగి 2014 లోనూ అదే ఎంపీ సీటును ఆశించారు. కానీ.. ఆయనకు నరసరావుపేట ఎంపీ టికెట్ కాకుండా.. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ టికెట్ ను ఖరారు చేశారు చంద్రబాబు. అక్కడి నుంచి కూడా మోదుగుల ఘన విజయం సాధించారు.