చిన్నచిన్న రుణాలు కూడా ప్రభుత్వాలు రద్దు చేస్తుండడంతో బ్యాంకింగ్ రంగం సంక్షోభంలో చిక్కుకుంటోంది. ఆశించిన ఆదాయాలు లేక రుణ రికవరీలు లేక బ్యాంకింగ్ రంగం ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉండిపోతున్నాయి. ముఖ్యంగా వడ్డీ లేని రుణాలు ఇచ్చినా కూడా సంబంధిత లబ్ధిదారులు దీన్నొక అదునుగా తీసుకుంటున్నారే తప్ప ప్రోత్సాహకరంగా భావించడం లేదు.
దీంతో తరుచూ బ్యాకింగ్ రంగంలో తీవ్ర అలజడులు రేగుతున్నాయి.ఆర్థిక అస్థిరతకు కారణం అయ్యే విధంగానే ప్రభుత్వ పథకాలు ఉండడం ఎంత మాత్రం భావ్యం కాదని వాళ్లు హితవు చెబుతున్నారు. అయినా కూడా ప్రభుత్వాలు వాటిని వినిపించుకునే స్థితిలో లేక తరుచూ ఏదో ఒక ప్రకటన పేరిట హడావుడి చేస్తున్నాయి.
ఆంధ్రా అయినా తెలంగాణ అయినా ఏ రాష్ట్రం అయినా రుణాల ఎగవేతదారుల తీరు కారణంగా నానా అవస్థలూ పడుతున్నాయి అక్కడి స్థానిక ప్రభుత్వాలు. దీంతో బ్యాంకులు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే ఉద్దేశ పూర్వక ఎగవేతదారులను ప్రోత్సహించేవిధంగానే ప్రభుత్వాలు రుణమాఫీ అంటూ హడావుడి చేస్తోందని, ఇదెంత మాత్రం మంచిది కాదని అంటున్నారు బ్యాంకర్లు. తాజాగా ఏపీలో జగనన్న తోడుకు శ్రీకారం దిద్ది చిరు వ్యాపారులకు పదివేలు చొప్పున రుణాలు మంజూరు చేశారు జగన్.
కానీ ఇదే సమయంలో ఆయన చెప్పిన మాటలు తప్పక గుర్తు పెట్టుకోవాలి. రుణాలు సకాలంలో తీర్చే బాధ్యతను విస్మరించడం తగదని పదే పదే గుర్తు చేశారు.ఆ విధంగా చిన్న మొత్తాలను సైతం కట్టేందుకు వ్యాపారులు ముందుకు రాకపోతే రేపటి వేళ ఇతరులకు రుణాలు అందవని సీఎం వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు తప్పనిసరిగా ఐదు లక్షలకు పైగా ఉన్న లబ్ధిదారులు దృష్టిలో ఉంచుకోవాలి.
ఇక రైతుల విషయానికే వస్తే ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ అంటూ తెగ హడావుడి చేసింది. అప్పుడు కూడా బ్యాంకర్లు గగ్గోలు పెట్టారు. ఈ విధంగా ప్రభుత్వాలు మాఫీ పేరిట ముందుకు వస్తే స్థోమత ఉండి కట్టగలిగే రైతు కూడా ఉద్దేశ పూర్వక ఎగవేత దారుడే అవుతాడని నెత్తీ నోరూ కొట్టుకుని మరీ! చెప్పారు. అయినా ఆరోజు చంద్రబాబు వినలేదు. ఇప్పుడు అదే పథకాన్ని జగన్ సర్కారు కూడా కంటిన్యూ చేస్తోంది. ఆఖరికి తెలంగాణలో కూడా యాభై వేల వరకూ తరువాత లక్ష వరకూ రైతు రుణాలు మాఫీ చేసేందుకు హరీశ్ రావు లాంటి మంత్రులు చేసిన ప్రకటనలు మరువకూడదు. కనుక రుణాలు తీసుకున్న వారు ఉద్దేశ పూర్వక ఎగవేత దారులు కాకుండా ఉంటే మేలు.