బుధవారం సాయంత్రంలో విజయవాడలో హైడ్రామా నడిచింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని పాదయాత్రగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అఖిలపక్ష నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైటాయించిన చంద్రబాబుని అరెస్ట్ చేసారు పోలీసులు. ఈ సందర్భంగా భారీ ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు నేతలు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు.
పోలీసులు చంద్రబాబుని తీసుకువెళ్ళి ఆయన ఇంటి వద్ద వదిలిపెట్టారు. అంత వరకు బాగానే ఉన్నా ఇక్కడ ఒక కీలక పరిణామం జరిగింది. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్న దివంగత వంగవీటి రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ, చంద్రబాబుకి రక్షణగా నిలిచారు. చంద్రబాబు ఇంటి వద్దకు కూడా వెళ్ళారు. ఆయన వాహనం వెంట వెళ్ళారు. విషయం తెలుసుకుని దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళారు.
ఇప్పుడు ఈ వార్త బెజవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్ళు ఆయన తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా ఎన్నికల ఫలితాల తర్వాత కలిసారు. వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరిగింది. అయినా సరే ఆయన తెలుగుదేశంలోనే ఉన్నారనే విషయం తాజాగా స్పష్టమైంది. దీనిపై తెలుగుదేశం కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు.
రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచాడని కార్యకర్తలు అతని గురించి పోస్టులు పెడుతున్నారు. అయితే దేవినేని అవినాష్ కారణంగా ఆయన పార్టీకి దూరంగా ఉన్నారని ఇప్పుడు అవినాష్ పార్టీని వీడటంతో మళ్ళీ పార్టీకి దగ్గరవుతున్నారని, ఆయన వర్గం కూడా పార్టీలో తిరుగుతుందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే రాధ రావడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.