తెలంగాణరాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యంగా ఉప ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో రాజకీయ నేతలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నారు. కీలకమైన హుజూర్ నగర్ నియోజకవర్గానికి త్వర లోనే ఉప ఎన్నిక జరగనుంది. గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేశారు. దీంతో ఆయన ఎంపీగా గెలుపొందారు. ఫలితంగా హుజూర్ నగర్ కు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికార టీఆర్ ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాలని భావిస్తున్నాయి.
తాము గెలిచిన స్థానాన్నినిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి గట్టి క్యాండెట్‌ను నిలబెట్టాలని నిర్ణయించుకుంది. అదేసమయంలో టీఆర్ ఎస్ కూడా నల్లగొండ ఎంపీ స్థానం ఎలాగూ పోయింది కాబట్టి.. ఇప్పుడు హుజూర్ నగర్‌లో అయినా తమ పట్టు నిలుపుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పార్టీ నుంచి పట్టున్న నేతను ఇక్కడ నుంచి పోటీకి నిలపాలని భావిస్తోంది. దీంతో ఇక్కడి రాజకీ యాలు వేడెక్కాయి. ఇక, అభ్యర్థుల విషయానికి వస్తే.. టీఆర్ఎస్ తరఫున ఇద్దరు బలమైన అభ్యర్థులు ఈ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
వీరిలో కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన కవిత, హుజూర్ నగర్ నుంచి డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడి న సైదిరెడ్డి ప్రముఖంగా తెరమీదికి వస్తున్నారు. వీరిలో కవితకే ఈ టికెట్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉందని సమాచారం. ఇదిలావుంటే, కాంగ్రెస్ నుంచి ఎవరు రంగంలోకి దిగుతారు? అనే ప్రశ్నకు చాలా మందే చేతులు ఎత్తుతున్నారు. ఇక్కడ నుంచి గెలిచిన ఉత్తమ్‌కుమార్ తన భార్య పద్మావతిని ఇక్కడ నుంచి దింపాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె అనాసక్తి ప్రదర్శిచండంతో మరికొందరు కీలక నాయకులు తమ అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి లేదా జానా రెడ్డి తనయుడు రఘువీరా రెడ్డిలను హుజూర్ నగర్ నుంచి పోటీ చేయించాలని టీ కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ విషయంలోనే ఇంత పోరు ఉంటే.. ఇక ఎన్నికల సమయానికి అధికార టీఆర్ ఎస్ ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య పోరు ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడం కష్టమని అంటున్నారు పరిశీలకులు.