విశాఖపట్నంలో కబ్జాల రాజకీయం నడుస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖ టీడీపీ నేతల టార్గెట్‌గా రాజకీయం ఎలా సాగుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. విశాఖ నగరంలో టీడీపీని మరింత వీక్ చేయడమే లక్ష్యంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు రాజధానుల నిర్ణయంతో విశాఖలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది.
విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించడంతో, నగరంలో వైసీపీకి అనుకూలంగా పరిస్తితులు మారాయి. కానీ విశాఖ నగరంలో టీడీపీ నేతలు స్ట్రాంగ్‌గా ఉండటంతో వారిని టార్గెట్ చేసుకుని విజయసాయిరెడ్డి, వైసీపీ నేతలు భూ కబ్జాల ఆరోపణలు గుప్పిస్తున్నారు. గత కొంతకాలంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావుని టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పల్లా వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములని కబ్జా చేశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అలాగే పల్లాకు చెందిన పలు అక్రమ కట్టడాలని కూల్చే కార్యక్రమం చేస్తున్నారు. తాను వైసీపీలోకి రాను అని చెప్పడం వల్లే, ఇలా తనపై కక్ష సాధిస్తున్నారని పల్లా విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం విశాఖ నగరంలో టీడీపీకి ఉన్న స్ట్రాంగ్ నాయకుడు పల్లానే. నగరంలో కీలకంగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఎప్పుడు పార్టీ మారతారో ఎవరికి తెలియదు. ఆయన టీడీపీలో కనిపించడం లేదు. ఇక మొన్నటివరకు విశాఖ నగరంలో కీలకంగా ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ సైతం వైసీపీ వైపుకు వెళ్లారు. ఇక సీనియర్ నాయకుడు సబ్బం హరి కరోనాతో కన్నుమూశారు.
అటు విశాఖ పార్లమెంట్ ఇన్‌చార్జ్, బాలయ్య చిన్నల్లుడు భరత్ సైలెంట్‌గా ఉంటున్నారు. దీంతో వైసీపీ పల్లానే గట్టిగా టార్గెట్ చేసింది. అటు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణని సైతం వదల్లేదు. ఆయనపై కూడా భూ కబ్జా ఆరోపణలు చేశారు. అయితే ఈ కబ్జా ఆరోపణలు నిరూపించి, వాళ్ళకి శిక్ష వేస్తే ప్రజలు నమ్ముతారు. అలా కాకుండా పార్టీలోకి రప్పించడానికే వైసీపీ ఎత్తులు వేస్తే, ప్రజలు ఎప్పటికైనా బుద్ధి చెబుతారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.
ఒకవేళ పల్లా వైసీపీలోకి వెళితే భూ కబ్జా ఆరోపణలు అసలు ఉండవనే చెప్పొచ్చు. పార్టీలోకి వెళ్ళగానే ఆయన పాపాలు మొత్తం పోతాయి. ఎందుకంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గానీ, ఇప్పుడు వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత గానీ నాయకులు పార్టీలు మారగానే పాత ఆరోపణలు వినిపించవు.