ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. ప్రంపంచం మొత్తాన్ని కట్టగట్టి బిగదీసి బంధీని చేసేసింది. ఎవరూ కాలు బయట కు పెట్టడినికి లేదు. ఏ పరిశ్రమా పనిచేయడానికి లేదు. అందరూ ఇంటికే.. అందరూ ఇళ్లకే! ఇదీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అ మలు జరుగుతున్న అమలు చేయిస్తున్న విధానం. దీంతో వ్యవస్థలు ఎక్కడికక్కడ కుప్పకూలుతాయని ప్రతి ఒక్కరూ ఒణికి పోతున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక, దేశంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాజకీయ పార్టీలు కూడా విమర్శలు మానేసి సహకరించుకుంటున్నాయి. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ తరహా వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపిస్తుండడం గమనార్హం. అయితే, ఏపీలో మరో అడుగు ముందుకు వేసి వ్యవహరిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తనకు తన పార్టీకి ఈ కరోనా కలిసి వస్తుందని ఆయన బావిస్తున్నారు. ఇప్పటి కిప్పుడు పార్టీకి లబ్ధి చేకూరకపోయినా.. రాబోయే రోజుల్లో పార్టీకి మంచి పరిణామమే అవుతుందని ఆయన భావిస్తున్నారట. దీనికి సంబంధించి టీడీపీ నాయకులు చెబుతున్న వాదన ఏంటంటే.. ప్రస్తుతం టీడీపీకి ప్రజల్లో ఆదరణ లేదు. అదేసమయంలో నాయకులు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు చంద్రబాబు అనేక రూపా ల్లో ప్రయత్నాలు చేశారు. అయినా కూడా ఫలించలేదు. అయితే, ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ కారణంగా.. చంద్రబాబు ప్రయత్నించకుండానే పార్టీ బలపడుతుందని అంటున్నారు. ఇది ప్రభు త్వ వ్యతిరేకత నుంచి పార్టీకి జరుగుతున్న లబ్ధిగా తమ్ముళ్లు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏపీ ప్రభుత్వంపై తీవ్ర మైన ఆర్ధిక భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే వలస కూలీలు సహా చేతి వృత్తులవారు, రోజు వారి కూలీలు పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. అదేసమయంలో వీరికి రెండు నెలల పాటు ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రేషన్ ఇచ్చింది. మరి తర్వాత పరిస్థితి ఏంటి? అదేసమయంలో ఆర్థిక పరిస్థితి కూడా కుంగిపోవడం ఖాయం.
ఇక, పరిశ్రమలు మూతబడ్డాయి. నిరుద్యోగం పెరుగుతుంది. వీటిని తట్టుకుని ప్రభుత్వం రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు మరో ఏడాది కాలం పడుతుంది. ఈ సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను తనకు అనుకూలంగా మార్చుకుని పార్టీని డెవలప్ చేసుకునేందుకు బాబు ప్రయత్నించే అవకాశం ఉందని అంటున్నారు. అదేసమయంలో స్థానిక ఎన్నికల్లోనూ బలోపేతం అయ్యేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.