కడప జిల్లా కమలాపురంలో అధికార పార్టీ వైసీపీలో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి తాజా ఎన్నికల్లో విజయం సాదించిన రవీంద్రనాథ్ రెడ్డి.. సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు స్వయానా మేనమామ అవుతారు. దీంతో ఆయన కేబినెట్‌లో సీటు ఖాయమని అనుకున్నారు. అయితే, జగన్ రెడ్డి వర్గాన్ని పక్కనపెట్టి .. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపులకు భారీగాఛాన్స్ ఇచ్చారు. తన కేబినెట్‌లోనూ రిజర్వేషన్ అమలు చేసుకున్నారు. దీంతో ఆయన ఈ షాక్ నుంచి బయటకు రాలేదు.
ఇదిలావుంటే, గడిచిన 9 ఏళ్లుగా పార్టీ అధికారంలో లేక పోవడంతో ఇక్కడ వైసీపీ అభిమానులు ఇప్పుడు పనులు చేయించుకునేందుకు ఎమ్మెల్యే దగ్గరకు క్యూ కడుతున్నారు. వాస్తవానికి ఏ నాయకుడికైనా పార్టీ పవర్‌లో లేక పోతే.. పనులు చేసే వారు ఉండరు. కానీ, ఇప్పుడు రవీంద్ర నాథ్ రెడ్డి పరిస్థితి పార్టీ అధికారంలో ఉన్నా కూడా పనులు చేసేవారు లేరా? అనే రేంజ్‌లో ఉన్నట్టు తెలు స్తోంది. చిన్న చిన్న పనుల కోసం తన వద్దకు వస్తున్న వారికి ఆయన ఇదే మాట చెబుతున్నారు. నేను చేయలేను అని నేరుగా చెప్పక పోయినా.. చూద్దాం చేద్దాం. అనే అంటున్నారు.
జగన్ తనకు ప్రాధాన్యం ఇవ్వలేదనే అక్కసు చాలానే ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తన ఇంటిని చక్కబెట్టుకోవడం మానేసి పరులకు పనులు చేస్తే.. ఎలా అనుకున్నారో ఏమో .. ఆయన ప్రతి పనినీ వాయిదా వేస్తూ వస్తుండడంతో దిగువ స్థాయి నాయకుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 2.8 లక్షల మంది వలంటీర్లను ప్రభుత్వం నియమించింది. దీనిలో వైసీపీ నాయకులు సిఫారసు చేసిన వారు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో కమలాపురంలోనూ తమను ఈ పోస్టులకు సిఫారసు చేయాలని చాలా మంది ఎమ్మెల్యే రవీంద్రనాథ్ ఇంటికి క్యూకట్టారు.
కానీ, ఆయన పట్టించుకోలేదు. దీంతో వారు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. ఈ క్రమంలో పోలీసులు, రవీంద్రనాథ్ సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకారులపై చేయి కూడా చేసుకున్నారు. ఇది మరింత వివాదంగా మారింది. మరోపక్క నిన్న మొన్నటి వరకు జగన్‌ను, పార్టీని తిట్టిపోసిన వీరశివారెడ్డిని పార్టీలోకి చేర్చుకోవడంపైనా శ్రేణులు భగ్గుమంటున్నాయి. మరి ఈ అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు ఎక్కడా సాగకపోవడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.