ఎడిట్ నోట్ : ఎన్టీఆర్ బాటలో జగన్  ! బీసీ మంత్ర  

-

పెద్దల సభకు సంబంధించి జగన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారిక పదవుల్లో, సంబంధిత రిజర్వేషన్లలో యాభై శాతం అవకాశాలు బీసీలకే ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించినందున వైఎస్ జగన్ తన ప్రతిపాదనకు కట్టుబడి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అదే సూత్రాన్ని వర్తింపజేయనున్నారు. ఇదే క్రమంలో..ఇదే కోవలో ఆదర్శం కానున్నారని కూడా వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే నాలుగు స్థానాలకు సంబంధించి వైసీపీ కోటాలో నిలబడే అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు అయ్యాయి. తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో మై హోం రామేశ్వర్ పేరు వినిపించినా అది కూడా కన్ఫం కాలేదు. ఆఖరి నిమిషంలో తెలంగాణ ప్రభుత్వం రికమెండేషన్లను సున్నితంగానే తిరస్కరించారు అని తెలుస్తోంది.

అదేవిధంగా ఆశావహుల జాబితాలో సొంత మనుషులు అయిన సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా ఉన్నారు. ఆయన్ను కూడా పార్టీ పదవికే పరిమితం చేశారు. ఎలానూ సలహాదారుగా ఉన్నారు కనుక ఆ పోస్టుకు మాత్ర ఢోకా లేదని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వ వ్యవహారాలు చాలా వరకూ చక్కదిద్దేది సజ్జల రామకృష్ణా రెడ్డే ! కానీ ఆయన కనుక ఢిల్లీ వ్యవహారాలకు పరిమితం అయితే స్థానికంగా ఉండే తలనొప్పులను భరించడం తనకు కష్టం అవుతుందని, అలానే తన తరఫున, ప్రభుత్వం తరఫున అఫీషియల్ వాయిస్ ఇచ్చే వారు కూడా ఉండరని జగన్ భావిస్తున్నారు.

మరోవైపు విధేయులుగా పేరున్న కొందరి పేర్లు కూడా బయటకు వచ్చాయి. సాయిరెడ్డిని తప్పిద్దాం అని కూడా అనుకున్నారు. అదే నెల్లూరుకు చెందిన మరో రెడ్డి .. మేకపాటి రాజమోహన్ రెడ్డి కి రాజ్యసభ  అవకాశంఇస్తారని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఇవి కూడా ఫేక్ అని తేలిపోయాయి. ఆయన్ను కూడా రేసులో ఉంచడం లేదని తేలిపోయింది. ఇక హెటిరో సంస్థల అధినేత, జగన్ సంస్థలకు ఓ విధంగా మెంటార్ పార్థ సారథి రెడ్డి పేరు అయితే అనూహ్యంగా ఏపీ రికమెండేషన్ తో వినిపించింది. కానీ తెలంగాణ రాష్ట ప్రభుత్వ పెద్ద ఆయన విషయమై సుముఖంగా లేరని నిర్థారితం అవుతోంది. మారుతున్న పరిణామాల ఆధారంగా ఇంకొన్ని పేర్లు వచ్చాయి. వాటిలో సుబ్బారెడ్డి పేరు కూడా బలంగానే ఉంది. కానీ వద్దన్నారు జగన్.

ఇప్పుడు రేసులో ఇద్దరు బీసీలు మిగిలారు. ఒక పారిశ్రామిక వేత్తకు ఛాన్స్ ఉంది కానీ అది కూడా కన్ఫం కాలేదు. బీసీల నుంచి కిల్లి కృపారాణి పేరు కన్ఫం అయిందని ప్రాథమికంగా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన తిరుగులేని నాయకురాలు ఈమె. యూపీఏ హయాంలో  టెలికాం శాఖకు సహాయ మంత్రిగా పనిచేశారు. సమర్థతతో పాటు విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇస్తూ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖాయం చేశారు. పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లడంలో సఫలీకృతం అవుతున్నారామె. వివాద రహితురాలిగా పేరుంది. అలానే వివిధ జాతీయ స్థాయి పరిణామాలపై పట్టు ఉంది. పాలసీలపై మాట్లాడగలరు. పార్టీ నిర్ణయించే విధి విధానాలకు సంబంధించి కానీ ప్రభుత్వ సంబంధిత నిర్ణయాలపై కానీ తప్పులు లేకుండా మాట్లాడి ఆకట్టుకునే నైజం ఉంది. ఇదే ఆమెకు ప్లస్ కానుంది. మరో అభ్యర్థిగా నెల్లూరుకు చెందిన బీద మస్తాన్ రావుకు కన్ఫం అయింది. వీరితో పాటు సాయిరెడ్డి పేరు ఎలానూ స్థిరం అయింది. ప్రీతీ అదానీ పేరు ఆఖరుగా వినిపించినా ఆమె విషయమై ఏ క్షణాన అయినా ఏ మార్పు అయినా రావొచ్చు.

ఆ విధంగా నాడు ఎన్టీఆర్ ఏ విధంగా బీసీ మంత్రం జపించి., బడుగు, బలహీన వర్గాల మెప్పు పొందారో అదే విధంగా ఈ సారి కూడా జగన్ తనదైన పంథాలో వెళ్తూనే, నాన్న వైఎస్సార్ ఫార్ములా ( నాయకులు అన్నవారు జనంలోనే ఉండాలి..వాళ్లతో మమేకం కావాలి.) ను కూడా ఫాలో అవుతున్నారు. ఆ విధంగా అటు అన్న గారి సూత్రాన్ని, ఇటు నాన్న నమ్ముకున్న నియమాన్నీ కలిపి తన నిర్ణయాలకు తిరుగులేని నైజం ఒకటి అందిస్తున్నారు. ఆపాదిస్తున్నారు. ఆ విధంగా దేశ రాజకీయాల్లోనూ, పార్లమెంట్ వేదికలపైనా తన తరఫున పార్టీ గొంతుక బలీయంగా వినిపించే నేతల ఎంపికకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

– రత్నకిశోర్ శంభుమహంతి

Read more RELATED
Recommended to you

Latest news