వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం దావోస్ లో జరుగుతోంది. ఈ నెల 22 నుంచి 26 వరకూ అక్కడే సీఎం జగన్ ఉండనున్నారు.ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి పారిశ్రామిక ప్రగతిని పెంపొందించేందుకు జగన్ వర్గాలు కృషి చేస్తున్నాయి. సీఎం వెంట మంత్రి గుడివాడ అమర్నాథ్ (పరిశ్రమలు మరియు ఐటీ శాఖ), పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు ఇంకొందరు జగన్ ను గైడ్ చేస్తున్నారు. మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి హోదాలో తొలి సారి విదేశీ యానం చేసిన జగన్ పై చాలా అంచనాలే ఉన్నాయి. మనకు పోటీగా తెలంగాణ రాష్ట్రం కూడా పెట్టుబడులను తమ రాష్ట్రానికి తెప్పించుకునేందుకు కృషి చేస్తోంది. ఓ విధంగా ఆ ప్రాంత ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన వంతు కృషి ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. దానికి కొనసాగింపుగా దావోస్ ను ఎంచుకున్నారు.
నిన్నటి వేళ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్ తో సీఎం జగన్ సమావేశం అవ్వడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్టుబడులకు సంబంధించి ఇరు వర్గాల మధ్య కొన్ని కీలక చర్చలు జరిగే ఉంటాయని, వీటి తరువాత విదేశీ వర్గాలతో ఒప్పందాలు ఉంటాయి అని, ఒప్పందాల మేరకే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, ఉత్పత్తి రంగం వృద్ధి అన్నవి ఆధారితం అయి ఉంటాయని సంబంధిత అధికారిక ప్రతినిధులు అంటున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన ఏపీ పెవిలియన్ లో పెట్టుబడులకు అందుబాటులో ఉన్న అవకాశాలు, పరిశ్రమల స్థాపనకు సానుకూలంగా ఉన్న విషయాలు వీటన్నింటినీ వివరిస్తున్నారు. ఏపీ పెవివిలయన్ ను సీఎం ప్రారంభించి, సంబంధిత వర్గాలతో అన్ని వివరాలూ చర్చించారు.
కాలుష్య రహిత అభివృద్ధే ధ్యేయంగా సంబంధిత పారిశ్రామిక ప్రగతిని సాధించేందుకు దావోస్ మీటింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా వైద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు కోసం ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు. ఇదే సందర్భంలో కోవిడ్ నుంచి పరిశ్రమలు కోలుకునేందుకు తానేం చేశానో అన్నది కూడా జగన్ వివరించే ప్రయత్నం చేశారు. ఈ వేదిక పై అదానీతోనూ జగన్ సమావేశమై కీలక విషయాలు చర్చించడం అత్యంత ఆసక్తిదాయకం. రాష్ట్రంలో కీలక దశలో ఉన్న ప్రాజెక్టులకు అదానీ గ్రూపు పెద్దలే ప్రధాన పెట్టుబడి దారులు అన్న సంగతి తెలిసిందే ! అయితే ఇరు వర్గాలకూ సంబంధించి ఏం చర్చలు నడిచాయో అన్నది అధికారికంగా తెలియరాకున్నా, వీలున్నంత మేరకు పారిశ్రామిక వృద్ధి రేటు పెంచేందుకు తమకు సహకరించాలని జగన్ కోరి ఉంటారని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.