అమరావతి (గుంటూరు): శాసనసభ సమావేశాల్లో రాష్ట్రాభివృద్ధిపై ప్రశ్నించలేని వైకాపా అధ్యక్షుడు జగన్ రోడ్లపైకి వెళ్లి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని ఏపీ జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము జగన్‌కు గానీ, పవన్‌కల్యాణ్‌కు గానీ లేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధిని చూడలేరని.. వాస్తవాలు మాట్లాడలేరని దుయ్యబట్టారు. జగన్ అడ్డంగా పడుకొని అడ్డుకున్నా.. 2019లో గ్రావిటీ ద్వారా పోలవరం నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు కేంద్రంపై పోరాడిన ఘనత టిడిపిదే అన్నారు. సర్వేలతో పగటి కలలు కనడం మానాలని జగన్‌కు హితవు పలికారు.