బీజేపీతో జనసేన అధికారికంగా పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఈ పొత్తులు పెద్దల వరకే ఉన్నాయి తప్ప కిందిస్థాయి కేడర్ కు మాత్రం సుతరామూ ఇష్టం లేదని తెలుస్తోన్న విచిత్ర పరిస్థితి అప్పుడే జనసేన తలుపుతట్టిందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు! ఇందుకు సంబందించి సాక్ష్యాలుగా నిలుస్తున్న కొన్ని తాజా సంఘటనలను వారు ఉదహరిస్తున్నారు… ఇదే క్రమంలో జనసైనికులు కూడా ఓపెన్ గానే అధినేతతో వీడియో కాన్ ఫరెన్సుల్లో బయటపడిపోతున్నారంట! ఈ క్రమంలో నష్టం బీజేపీకా జనసేనకా అనే సంగతి కాసేపు పక్కన పెడితే… తీరా పెద్ద మనుషుల ఒప్పందాలు అయిపోయాక జనసైనికులు రాజీపడి అధినేతకు సై అంటారా… అది ఏమాత్రం కుదరదని అంటున్నారా… అనేది ఇప్పుడుచూద్దాం!
గతకొన్ని రోజులుగా కరోనా పేరుమీద వివిధ జిల్లాల నేతలతో వీడియో కాంఫ రెన్సుల్లో మాట్లాడుతున్నారు పవన్ కల్యాణ్! ఈ సమయంలో ఆయన ప్రధానంగా దృష్టి పెట్టింది మాత్రం… కరోనా సహాయ కార్యక్రమాల్లో జనసైనికులు ఉషారుగా పాల్గొనాలని.. ఇదే క్రమంలో బీజేపీ కార్య్యకర్తలతో కలిసి పనిచేయాలని! అదేంటి… కరోనా సమయంలో సహాయ కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం ఓకే కానీ… మళ్లీ ఈ మెలిక ఏమిటనేది జనసైనికుల బాదగా ఉందంట! వారి ఉద్దేశ్యం ఏమిటంటే… ఏపీలో బీజేపీ కేడర్ కంటే జనసేన కేడర్ చాలా ఎక్కువనేది వారి అభిప్రాయం! దీంతో పని మాది పబ్లిసిటీ వాళ్లకా అన్నట్లు జనసేన అధినేత విన్నపాన్ని జనసైనికులు తోసిపుచ్చుతున్నారంట!
కరోనా.. విశాఖ ఎల్జీపాలిమర్స్ ఘటన.. స్థానిక సమస్యలు… ఇలా ఎన్ని సందర్భాల్లో అయినా సహాయ సహకారాల విషయంలో జనసేన తనకు తాను ఒంటరిగా పనిచేసుకుంటూ పోతాది తప్ప… బీజేపీని కలుపుకుపోదనేది జనసైనికుల మాటగా ఉందట! కానీ… ఈ విషయంలో మాత్రం మద్య మద్యలో బీజేపీ నాయకుల్ని హైలెట్ చేస్తూ… కర్ర ఇరగకుండా పాముచావకుండా నెట్టుకొస్తున్నారు పవన్! ఇంతకూ… అసలు జనసైనికుల బాదఏమిటో ఇప్పుడు చూద్దాం!
ఏపీలో వైకాపా ఒక్కటే బలమైన పార్టీగా దూసుకుపోతుంది! 2019 సార్వత్రిక ఎన్నికల అనంతర పరిస్థితులను గమనిస్తుంటే… టీడీపీ కోలుకోవడం కష్టం! ఇక ఏపీలో వైకాపాకు ప్రత్యామ్నాయ శక్తిగా.. ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చి అయినా జనసేన నిలబడాలనేది జనసైనికుల కోరికగా ఉంటే… తనకు అంత ఆలోచన లేదు కానీ… ఏదోలా బీజేపీ నీడనో, టీడీపీ పక్కనో బ్రతికేద్దాం అనేలా పవన్ ఆలోచన ఉందేమో అనేది కొందరు జనసైనికుల ఆవేదనగా ఉందట! మరి వీరి కోరికను పవన్ అర్ధం చేసుకుని ఒంటరిగా, బలమైన శక్తిగా ఎదగడానికి ప్రయత్నిస్తారా… లేక తాను అనుకున్నట్లుగానే కాలం వెళ్లదీస్తారా అనేది వేచి చూడాలి!!