కాకినాడను సొంత నియోజకవర్గంగా మార్చుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు జనసేన వర్గాలు. అక్కడి నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ ఎక్కడినుంచి పోటీ చేయాలి అని విషయంలో చాలా రోజుల నుంచి తర్జనభర్జనలు పడుతున్నారు. కాపు సామాజికవర్గ0 కీలకంగా ఉన్న నియోజకవర్గాలకు పవన్ పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాకినాడపై కాస్త ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గంపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కాకినాడ సిటీలో 50 వార్డులు ఉండగా ఏయే వార్డులో ఏయే సామాజికవర్గాలు ఎక్కువగా ఉన్నాయో వారి పెద్దలతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే 28 వార్డుల పెద్దలతో మంతనాలు పూర్తి చేశారు.కాకినాడ టూర్ లో భాగంగా 22 వార్డులపై సమీక్ష నిర్వహించబోతున్నారని సమాచారం.ఎక్కడ పోటీ చేయాలన్నా అక్కడ సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటే ప్రజలకు అందుబాటులో ఎక్కువగా అందుబాటులో ఉండొచ్చు.
కాకినాడలో ఈ ప్రయత్నాలు కూడా పవన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.కాకినాడ చుట్టు పక్కల విశాలమైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కాకినాడ నగరం నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం కాకినాడ జిల్లాపై పడే అవకాశం ఉందని అందుకే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారంపై పవన్ గతంలో చాలా సార్లు ఫైర్ అయ్యారు. ఆయన రౌడీ యిజాన్ని అణిచి వేస్తానని గతంలో వారాహి యాత్ర జరిగినప్పుడు పవన్ చెప్పగా కాకినాడ నుంచి పోటీ చేయాలని ద్వారంపూడి కూడా సవాల్ చేశారు. అయితే ఆ సమయంలోనే పవన్ కాకినాడ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని జనసేన వర్గాలు అంటున్నాయి.
కాకినాడ సిటీలో అత్యధికంగా కాపు సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. అటు పొత్తులో ఉన్న టీడీపీ కి క్యాడర్ కూడా బలంగానే ఉంది.ఈ క్రమంలో కాకినాడ నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ద్వారంపూడి ని ఎలాగైనా ఓడించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలో రెండు, మూడు ప్రైవేటు సంస్థలతో సర్వేలు చేయించగా మంచి మెజార్టీలు రావచ్చని చెప్పినట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ కాకినాడను ఫైనల్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ విషయం గ్రహించిన వైసీపీ నేతలు పవన్ కి ఇక్కడ కూడా ఓటమిని అంటగట్టేందుకు సిద్ధమయ్యారు.