రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరినా.. నెల్లూరు జిల్లాలో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు.. స్థానిక నేతల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో.. కలిసి ముందుకు సాగలేకపోతున్నారు.. కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు ప్రచారాలు నిర్వహిస్తుంటే జనసేన నేతలు మాత్రం తమకు సంబంధం లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారట.. దీంతో స్థానికంగా టిడిపికి దెబ్బ ఖాయం అనే ప్రచారం జరుగుతోంది..
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధించాలని టిడిపి పట్టుదలతో ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు బలహీనులు కావడంతో ఆ ఆశలు నిరాశగా మారే అవకాశాలు ఉన్నాయి.. దానికి తోడు జనసేన నేతలు సైతం టిడిపితో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి జనసేనతో పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాలనైనా కైవసం చేసుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుంది అంట.. నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించకపోవడంపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం నడుస్తుంది.
దీంతో సిటీ నియోజకవర్గంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణకు జనసేన నేతలు సహకరించి అవకాశమే లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.. అలాగే రూరల్ నియోజకవర్గంలో కూడా టిడిపికి ఇబ్బందికరమైన వాతావరణమే ఉందట.. ఇక కోవూరు, కావలి, ఉదయగిరి వంటి ప్రాంతాలలో జనసేనకు ఇమేజ్ ఉండే లీడర్ లేకపోవడంతో టిడిపి తమ సొంత బలాన్ని నమ్ముకుని ఎన్నికల్లో దిగబోతోంది. కొద్దో గొప్పో ప్రభావితం చేసే జనసేన నేతలు సైతం టిడిపి నేతలతో టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తూ ఉండడంతో టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారట..
వచ్చే ఎన్నికలలో తమకు పూర్తిగా సహకరిస్తే.. మంచి భవిష్యత్తు ఉంటుందని టిడిపి నేతలు చెబుతున్నప్పటికీ.. జనసేన నేతలు అస్సలు స్పందించడం లేదట. దీంతో టిడిపి అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తుంది. బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఢీకొనాలంటే ఇరు పార్టీలు సమన్వయంతో పని చేయాలని.. లేకపోతే 2019లో వచ్చిన ఫలితాలే పునరావృతం అవుతాయని టిడిపి నేతలు చర్చించుకుంటున్నారు..