సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుని కేవలం గెలిచే సత్తా ఉన్నవారికే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు టిక్కెట్లను ఇవ్వాలని పవన్ నిర్ణయంచుకున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల అభ్యర్థులను మరో రెండు రోజుల్లో ఖరారు చేసి.. అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో జనసేన తన తొలి జాబితాను విడుదల చేస్తుందని తెలిసింది.
లోక్‌సభ ఎన్నికలతోపాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం విదితమే. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికలకు కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు ప్రారంభించేశాయి. ఈ క్రమంలోనే అభ్యర్థులను త్వరగా ఎంపిక చేసి ప్రచారంలో కూడా అందరి కన్నా ముందుగానే దూసుకుపోవాలని పార్టీలు భావిస్తున్నాయి.
ఇక ఏపీలో జనసేన పార్టీ కూడా ఇతర పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేసే యత్నాల్లో ఉంది. అందులో భాగంగానే పలువురు అభ్యర్థులను ఎంపిక చేసి మరో రెండు రోజుల్లో తన తొలి జాబితాను విడుదల చేస్తుందని తెలుస్తోంది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం వాటిని జనరల్ బాడీకి అందజేశారు. ఇక అభ్యర్థుల ఎంపికపై పవన్ తమ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే అందరి అభిప్రాయలను పరిగణనలోకి తీసుకుని పవన్ జనసేన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అలాగే సామాజిక సమీకరణలు బేరీజు వేసుకుని కేవలం గెలిచే సత్తా ఉన్నవారికే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు టిక్కెట్లను ఇవ్వాలని పవన్ నిర్ణయంచుకున్నారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల అభ్యర్థులను మరో రెండు రోజుల్లో ఖరారు చేసి.. అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులతో జనసేన తన తొలి జాబితాను విడుదల చేస్తుందని తెలిసింది.
కాగా జనసేన పార్టీకి చెందిన తొలి జాబితాలో ఉండనున్న పలువురు నేతల పేర్లు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తొలిజాబితాలో తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఉంటాయని సమాచారం. అలాగే తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నుంచి బీసీ నేత పితాని బాలకృష్ణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా, రాజమహేంద్ర వరం ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, రాజమహేంద్రవరం రూరల్ నుంచి కందుల దుర్గేష్, తుని నుంచి రాజా అశోక్ బాబు, మండపేట నుంచి దొమ్మేటి వెంకటేశ్వర్లు, కాకినాడ రూరల్ నుంచి అనిశెట్టి బుల్లెబ్బాయి, పి.గన్నవరం నుంచి పాముల రాజేశ్వరి, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్‌లు పోటీ చేస్తారని.. ఈ క్రమంలో వీరి పేర్లతో జనసేన తొలి జాబితా ఉండవచ్చని తెలుస్తోంది.
అలాగే గుంటూరు జిల్లాలో తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని సమాచారం. కాగా నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీని వదలి జనసేనలో చేరి పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్న నేపథ్యంలో తొలి జాబితాలో ఆయన పేరు కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక అనంతపురం జిల్లాలో రాజకీయ నాయకులు కాకుండా ప్రజాసేవ చేసే ఇద్దరికి టిక్కెట్ ఇస్తారని తెలిసింది. ఈ క్రమంలో వీరి పేర్లు కూడా జనసేన తొలి జాబితాలో ఉంటాయని జోరుగా ప్రచారం సాగుతోంది..!