అమరావతి (విశాఖపట్టణం): శ్రీకాకుళం జిల్లాలో పెను విధ్వంసం సృష్టించిన తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రోజులు పర్యటన పూర్తయింది. ఈ సందర్భంగా విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అక్కడి పరిస్థితులను పవన్ వెల్లడించారు. తుపాను ముందు, తర్వాత ఉద్దానం ఎలా ఉందో అనే దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జీడి, కొబ్బరి తోటలకు ఇచ్చే ప్రభుత్వ పరిహారం పెంచాలని, మామిడి, జీడి, కొబ్బరి తోటలకు హెక్టార్‌కు రూ.50వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హెక్టార్ వరికి రూ.40వేలు, పశువులకు రూ.40వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు, చిన్న దుకాణదారులకు రూ.25వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తుపాను ప్రాంతాల్లో రైతులకు రుణాలను మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్దానంలో జీడిపప్పు అభివృద్ధికి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. తుపాను నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్‌కు లేఖలు రాస్తామన్నారు. కేంద్ర బృందాన్ని 15 రోజుల్లో పంపాలని కోరతామని తెలిపారు. మంగళవారం నుంచి జనసేన తరఫున ఏడు బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తాయని పవన్ వెల్లడించారు. మొదటి దశలో విద్యార్థులకు పుస్తకాలు, సామగ్రి అందజేయనున్నట్టు చెప్పారు.