జనసేనాని పోటీ చేసే ఆ రెండు స్థానాలు ఇవే…!

ఏపీ రాజకీయాలు టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్యేనా? మధ్యలో ఇంకే పార్టీ లేదా? ఎందుకు లేదు ఉంది. కానీ.. దాని ప్రభావం అంతంత మాత్రమే. నిజానికి అన్ని సర్వేలు కూడా ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్యే అని తేల్చాయి. కానీ.. జనసేనకు కూడా కాస్త ఓటింగ్ శాతం ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి..

ఏపీలో రాజకీయాలు ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్యనే రగులుతున్నప్పటికీ.. మధ్యలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కాస్తో కూస్తో మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఆయనకు కూడా ఈసారి ఓట్ల శాతం బాగానే ఉండేటట్టు కనిపిస్తోంది.

అయితే.. ఇంత వరకు ఎప్పుడూ ఎన్నికల్లో పాల్గనని జనసేన ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అయితే.. అన్నింటి కన్నా ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపైనే అందరి దృష్టి.ఇదివరకు ఆయన అక్కడ చేస్తారు.. ఇక్కడ చేస్తారు అంటూ ఊహాగానాలు వినిపించినా జనసేన అధినేత పవన్ చివరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.జనరల్ బాడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించింది. ఆ సర్వే ప్రకారం జనసేన పార్టీ అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్ఛాపురం స్థానాల్లో అగ్రస్థానాల్లో నిలిచింది.