గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీకి సై అంటున్న జనసేన

-

ఉద్యమాల పోరుగడ్డ ఓరుగల్లులో పోటీకి జనసేన సై అంటోంది. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ రాజ‌కీయాల్లో క్రియాశీల‌క‌మ‌వుతామ‌న్న జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా. జన సైనికులు గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోటీకి జన సైనికులు ఎందుకు సిద్దమయ్యారు..జన సేన అధినేత నుండి సంకేతాలు అందాయా..పోటీ చేస్తే ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అన్న దాని పై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

గ్రేటర్ వరంగల్ ఎన్నికల బరిలో దిగేందుకు దాదాపు నెల‌ రోజుల ముందు నుంచే రాష్ట్ర క్యాడర్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఏకంగా వరంగల్‌లో పార్టీ కార్యాల‌యాన్ని కూడా ప్రారంభించి..కార్యాచరణ మొదలు పెట్టింది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో సాధ్యమైన‌న్నీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న ఆ పార్టీ నేత‌లు భారీ ర్యాలీలతో జనసేన పోటీలో ఉంటుంది అనే సంకేతాలను ఇచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నారు. మరో వైపు ఏపీలో బీజేపీతో జనసేన పొత్తు నేపథ్యంలో కార్పోరేషన్ ఎన్నికల్లో ఉంటుందా లేదా అన్న చర్చ సైతం నడుస్తుంది.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ నేతలకు షాక్ ఇచ్చి టీఆర్ఎస్ అభ్యర్దికి మద్దతు తెలిపారు. ఆ తర్వాత రెండు పార్టీల నేతల మధ్య సయోద్య జరిగింది. తిరుపతి,సాగర్ ఉపఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బిజీగా బీజేపీ,జనసేన పార్టీల రాష్ట్ర నాయకులు పొలింగ్ ముగిసిన తర్వాత గ్రేటర్ వరంగల్ ఎన్నికల పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది. స్థానిక జనసేన నేతలు మాత్రం అన్ని డివిజన్, బూతు కమిటీలు ఏర్పాటు చేసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల గెలుపు ఓటములను శాసించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

జనసేన కచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపబోతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి క్యాడర్ రెడీగా ఉండాలటున్నారు ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్. మరోవైపు జనసేన దూకుడుపైన ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. జనసేన బరిలోకి దిగితే ఏ పార్టీకి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news