ఏపీ రాజకీయాలు రోజు రోజుకూ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార టీడీపీ పార్టీ నుంచి వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్లంతా టీడీపీ ముఖ్య నేతలే కావడం గమనార్హం. దీంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వీళ్లే కాదు.. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. టీడీపీ నుంచి చాలామంది నేతలు వైసీపీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారట. కొందరు వైసీపీతో టచ్‌లోనూ ఉన్నారు. ముహూర్తం చూసుకొని వైసీపీలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇవాళే అమలాపురం ఎంపీ రవీంద్రబాబు జగన్ సమక్షంలో వైఎస్సాఆర్‌సీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్ మామ, లక్ష్మీ ప్రణతి తండ్రి… నార్నె శ్రీనివాసరావు ఇవాళ జగన్‌ను కలిశారు. దీంతో ఆయన కూడా వైసీపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అసలే ఎన్నికల కాలం, నార్నె టీడీపీ మద్దతుదారుడు కావడం.. జగన్‌ను ప్రత్యేకంగా కలవడంతో నార్నె వైసీపీలో చేరిక ఖాయం అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే.. నార్నె మాత్రం జగన్‌తో భేటీకి.. వైసీపీలో చేరికకు సంబంధం లేదని.. మర్యాద పూర్వకంగా కలిశానని చెబుతున్నారు. నార్నెకు, జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందువల్లే జగన్‌ను కలిశాను తప్పితే మరో ఉద్దేశం లేని నార్నె వెల్లడించారు. ఏది ఏమైనా ఎన్నికల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరిగేది ఎవరూ ఊహించలేరు. దానికి నిదర్శనమే ఇప్పటి వరకు టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన నేతలు. ఏమో.. కొన్ని రోజుల్లో నార్నె కూడా వైసీపీ కండువా కప్పుకుంటారేమో.. వేచి చూద్దాం.