నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ఎనిమిదేళ్లుగా తాము చేసిన సంక్షేమం గురించి వివరిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుండగా.. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ తాము అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి బీజేపీ హామీల వర్షం కురిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్.. టీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనంటూ కపటనాటకం ఆడుతున్నాయని విమర్శలు గుప్పిస్తోంది.
ఇలా ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరందుకుంటున్న తరుణంలో.. మునుగోడు నియోజకవర్గానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేేఏ పాల్ ఎంట్రీ ఇచ్చారు. తన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. కేఏ పాల్ 59వ పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం మునుగోడులో నిర్వహించిన సభకు ఆయన హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ఎద్దేవా చేశారు.
తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. మునుగోడులో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి, కార్పొరేట్ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు. పాల్ 59వ జన్మదినం సందర్భంగా 59 మందికి వీసా లక్కీ డ్రాను తీశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కోశాధికారి జ్యోతి, ప్రజాగాయకుడు గద్దర్ తదితరులు పాల్గొన్నారు.