చంద్రుడిపైకి మనిషిని పంపే ప్రాజెక్టులో భాగమే ఆర్టెమిస్ 1. నాసా ప్రయోగించాలనుకున్న అతి శక్తివంతమైన ఈ రాకెట్‌కు ఇప్పటికీ సమస్యలు తొలగడం లేదు. మొదట ఈ ప్రయోగం మంగళవారం జరగవచ్చని భావించినా.. ఇయాన్ హరికేన్ కారణంగా మరోసారి జాప్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తుపానుగా మొదలైన ఇయాన్ వచ్చేవారానికి మరింత బలపడి హరికేన్‌గా మారవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు సమస్యలతో ఇప్పటికే ఆర్టెమిస్ ప్రయోగం రెండుసార్లు వాయిదా పడింది.
ఆగస్టులో జరగాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాల వల్ల ఒక సారి వాయిదా పడింది. సెప్టెంబర్‌లో రెండోసారి ప్రయత్నించగా.. ఇంధన లీకేజీ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మరోసారి దీనిని వాయిదా వేశారు. తాజాగా ఇయాన్ తుపాను రావడంతో శాస్త్రవేత్తలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటి వరకు ప్రయోగ వేదిక వద్దే ఉంచి మరమ్మతులు చేశారు. కానీ, దీనిని తిరిగి అసెంబ్లింగ్ సైట్‌కు తరలించే విషయంపై ఆదివారం ఓ నిర్ణయం తీసుకోనున్నారు.