ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కు చెందిన వామపక్ష విద్యార్థి నేత కన్నయ్య కుమార్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనున్నాడు. బీహార్‌లోని బెగుసరై లోక్‌సభ నియోజకవర్గం నుంచి కన్నయ్య కుమార్ పోటీ చేస్తాడని ఆ రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సింగ్ తెలిపారు. సీపీఐ నుంచి కన్నయ్య కుమార్ పోటీ చేస్తాడని, అతనికి వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయని, దీంతోపాటు రాష్ట్రంలోని మిత్ర పక్ష పార్టీలైన కాంగ్రెస్, ఆర్‌జేడీలు కూడా కన్నయ్య కుమార్‌కు మద్ధతు ప్రకటించాయని సత్యనారాయణ సింగ్ తెలిపారు.
కన్నయ్య కుమార్ నిజానికి అదే నియోజకవర్గానికి చెందిన భీహాట్ గ్రామ పంచాయతీ నివాసి. ఈ క్రమంలోనే కన్నయ్య కుమార్‌ను బెగుసరై లోక్‌సభ ఎంపీగా 2019 ఎన్నికల్లో సీపీఐ నుంచి నిలబెడుతున్నారు. అయితే గతంలో.. అంటే.. 2014లో బెగుసరై నియోజకవర్గంలో ఆర్‌జేడీ అభ్యర్థి తన్వీర్ సింగ్‌పై బీజేపీ అభ్యర్థి భోలాసింగ్ 58 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఇక 2019 ఎన్నికల్లో భోలాసింగ్ అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తారా, అన్నది ఎన్నికలప్పుడు తెలుస్తుంది. ఒక వేళ పోటీ చేస్తే ఆయన కన్నయ్యకు ప్రత్యర్థి అవుతారు.
ఆర్‌జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ ఇదివరకే కన్నయ్య కుమార్ పేరును ఆ నియోజకవర్గ లోక్ సభ స్థానానికి ప్రతిపాదించారట. కానీ ఆ ప్రతిపాదనపై అన్ని పార్టీలు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. కానీ ఇప్పుడు కన్నయ్యకు ఆ పార్టీలు మద్దతు పలికాయి. దీంతో కన్నయ్య వచ్చే ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలో కన్నయ్యపై ఢిల్లీ పోలీసులు గతంలో దేశ ద్రోహ కేసు నమోదు చేశారు. మరి.. రానున్న ఎన్నికల్లో కన్నయ్య విజయం సాధించి ఎంపీ అవుతాడా, లేడా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.