తెలంగాణ రాష్ట్రం మాత్రమే కాదు.. యావత్తు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసింది ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని. అవును.. ఈసారి ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలపై ఏదో ప్రకటిస్తారు. అందుకే ఇంత పెద్ద సభ నిర్వహిస్తున్నారు. సభకు వచ్చే జనాలతో ముందస్తు ఎన్నికల గురించి హామీ తీసుకుంటారు. ముందస్తు ఎన్నికలు ఖాయం ఇక. ప్రతిపక్షాలకు వణుకు పుట్టడం ఖాయం. అసెంబ్లీ రద్దు ప్రకటన వచ్చేసుంది.. అంటూ గత కొన్ని రోజుల నుంచి పత్రికలు తెగ ఊరించాయి. చివరకు ఏమైంది. ముందస్తుపై ఏ ప్రకటనా లేదు.. గికటనా లేదు. మందస్తు కాస్త తుస్సయిపోయింది. దీంతో ప్రతిపక్షాలు మాత్రం ఊపిరి పీల్చుకున్నాయి.
ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయంటే మామూలు విషయం కాదు కదా. అందుకే దేశం మొత్తం ఆసక్తిగా ప్రగతి నివేదన సభపై ఆసక్తిని కనబర్చింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా సీఎం కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేస్తోరో అని గుక్కపట్టుకొని కూర్చున్నాయి. కానీ.. ముందస్తుపై ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు కేసీఆర్. రాజకీయ నిర్ణయంపైనా ఎటువంటి నిర్ణయం రాలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పథకాల గురించే చెప్పారు.
అయితే.. చివర్లో మాత్రం ఓ హింట్ ఇచ్చారు సీఎం. ముందస్తు ఎన్నికలపై మీడియాలో వస్తున్న వార్తలపై మాత్రం సీఎం స్పందించారు. ముందస్తుపై పేపర్లలో, మీడియాలో వస్తున్న వార్తలను టీఆర్‌ఎస్ నాయకులు తనతో చెబుతున్నారని.. మంత్రి వర్గ సభ్యులు ఏది మంచి నిర్ణయమైతే అది మీరే తీసుకోవాలని తనకే అప్పగించారని సీఎం అన్నారు. త్వరలోనే రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకొని ప్రజల ముందు తప్పకుండా వస్తాం అని సీఎం హామీ ఇచ్చారు.