టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానంతో ప్రమేయం లేకుండానే బహిరంగ ప్రకటనలు చేయడం పార్టీలో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బేగ్ ను గెలిపిస్తానంటూ స్టేట్మెంట్ ఇవ్వడం దీనికి కారణం. ఇప్పటికే కేశినేని ఒంటెద్దు పోకడలపై టీడీపీ హైకమాండ్ గుర్రుగా ఉంది. కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గాల మధ్య ఆధిపత్య పోరు కూడా చాలాకాలం నుంచి నడుస్తోంది.
బహిరంగ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఉండడంతో పార్టీ చీఫ్ చంద్రబాబు ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. నాని తీరుపై అసహనం వ్యక్తం చేస్తోన్న చంద్రబాబు, ఈసారి విజయవాడ ఎంపీ టిక్కెట్ నాని సోదరుడు చిన్నికి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇది నచ్చని నాని పలుమార్లు పార్టీపై, చంద్రబాబుపై విమర్శలు కూడా చేశారు. దీంతో నాని పార్టీ మారే అవకాశముందని అప్పట్లో పెద్ద చర్చే నడిచింది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారేది లేదని తేల్చి చెప్పారు. ఆయన బహిరంగ విమర్శలు చేస్తున్నప్పటికీ చంద్రబాబు మాత్రం నాని విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ నుంచి బుద్దా వెంకన్న పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి నాగుల్ మీరా కూడా బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నారు. ఆయన కూడా టిక్కెట్ వస్తుందనే భావిస్తున్నారు. ఇదిలావుంటే తాజాగా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నుంచి ఎవరు అడ్డొచ్చినా ఎంఎస్ బేగ్ ను ఎమ్మెల్యేగా చేస్తానని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అయింది.
బేగ్ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాని పిలుపునిచ్చారు. బేగ్ విజయం కోసం తాను కష్టపడతానని చెప్పారు. అలాగే విజయవాడ ఎంపీగా మూడోసారి పోటీ చేసి లోక్ సభలో ముచ్చటగా మూడోసారి అడుగుపెడతానని స్పష్టం చేశారు. చంద్రబాబు టిక్కెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా.. ప్రజలు కోరుకుంటే వారి ఆశీస్సులతో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగుతానన్నారు. విజయం సాధించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ఎంఎస్ బేగ్ జన్మదిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నాని, ఈ విధమైన ప్రకటనలు చేయడం.. టీడీపీ వర్గీయుల్లో అగ్గి రాజేసినట్లయింది. మరి నాని వ్యాఖ్యలపై పార్టీ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.