వైసీపీ ఎమ్మెల్యేతో స్నేహం చేస్తున్న కేసినేని నానీ…!

విజయవాడ రాజకీయాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ ఎంపీ కేసినేని నానీ వ్యవహారశైలి కాస్త భిన్నంగా ఉంటుంది. రాజకీయంగా టీడీపీ ఇబ్బందుల్లో ఉన్నా సరే తన శైలిని మాత్రం ఎంపీ గారు ఎప్పుడు పక్కన పెట్టలేదు. పార్టీ ఓటమి తర్వాత అధిష్టానం మీద అలిగి, దేవినేని ఉమాను తిట్టి ఆ తర్వాత మంత్రి కొడాలి నానీ, ఉమాకు క్షమాపణలు చెప్పాలని అనడం, ఆ తర్వాత బుద్దా వెంకన్నతో వివాదం వంటివి జరిగాయి.

ఆ తర్వాత పార్టీ ఆఫీస్ విషయంలో ఉమాతో గట్టిగానే విభేదాలు వచ్చాయి. వల్లభనేని వంశీ వ్యవహారంలో కూడా కేసినేని, దేవినేని మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మరింతగా పెరిగిందని అంటున్నారు బెజవాడ రాజకీయాలు గమనిస్తున్న వారు. దేవినేని ప్రత్యర్ధి అయిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కేసినేని నానీ కొన్ని రోజులుగా స్నేహం చేస్తున్నారని అంటున్నారు.

విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉండే మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం కృష్ణ ప్రసాద్ ఎంపీ గారిని కలవడమే కాకుండా తన నియోజకవర్గానికి కేంద్రంతో నిధులు మంజూరు చేయించాలని, నితిన్ గడ్కారితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏదోక చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఉమాకు మండింది అంటున్నాయి టీడీపీ వర్గాలు.

ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ తో నానీ స్నేహం చేయడం, సీనియర్ ఐపిఎస్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు మీద వివాదాస్పద ట్వీట్ చేయడం వంటివి పార్టీ అధిష్టానానికి కూడా చికాకు తెప్పించాయి. అయితే అధినేత చంద్రబాబుకి సన్నిహిత నేత కావడం, కేంద్ర మంత్రులతో మంచి సంబంధాలు ఉండటంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో టీడీపీ నేతలు కూడా ఉన్నారు. ఆయన చేసేది చూడటం మినహా ఫిర్యాదు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది.